కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టం CAA-2019పై దేశవ్యాప్తంగా నిత్యం నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ చట్టం అమలును అడ్డుకుని తీరుతామని ప్రకటించిన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం పట్టు వీడడం లేదు. వీధుల్లో నిరసన గళం వినిపిస్తూ ఆమె నిత్యం భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్న విషయాన్ని ఆమె గుర్తుచేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆమె అల్టిమేటం జారీ చేశారు. అమిత్ షా కేవలం బీజేపీ నేత మాత్రమే కాదు.. ఈ దేశానికి హోం మంత్రి. దేశంలో శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. కానీ అమిత్ షా ఇవేవీ పట్టించుకోవడం లేదంటూ మమతా బెనర్జి మండిపడ్డారు. 


ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను లక్ష్యంగా చేసుకుని పలు విమర్శలు చేసిన దీదీ.. ''సబ్ కా సాత్.. సబ్ కా వికాస్.. నినాదంతో వచ్చిన బీజేపీ, సబ్ కే సాత్ సర్వనాశ్‌ను అమలు చేస్తోంది'' అని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరసత్వ జాబితాను అమలు కానివ్వమని ఆమె పునరుద్ఘాటించారు.