మమతా బెనర్జీని స్పీడ్ బ్రేకర్తో పోల్చిన ప్రధాని నరేంద్ర మోదీ
మమతా బెనర్జీపై ప్రధాని నరేంద్ర మోదీ ఫైర్
సిలిగురి: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మీరంతా ( పశ్చిమ బెంగాల్ ప్రజలు) దీదీ అని పిలుచుకునే మీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే మీ అభివృద్ధికి ఓ స్పీడ్-బ్రేకర్‌లా తయారయ్యారని మోదీ ఆమెపై మండిపడ్డారు. మమతా బెనర్జిపై తీవ్ర ఆరోపణలు చేసిన ప్రధాని మోదీ.. కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల ఫలాలు పశ్చిమ బెంగాల్ వాసులకు పూర్తిస్థాయిలో అందడం లేదని అన్నారు. అందుకే పశ్చిమ బెంగాల్‌లో అభివృద్ధి కుంటుపడిపోయిందని మోదీ ఆవేదన వ్యక్తంచేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో బీజేపి తలపెట్టిన ఓ బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ ది ఓ ప్రత్యేక స్థానం అనే చెప్పుకోవాలి. అత్యధిక స్థానాలున్న ఉత్తర్ ప్రదేశ్ (80), మహారాష్ట్ర (48) రాష్ట్రాల తర్వాత 42 లోక్ సభ స్థానాలతో పశ్చిమ బెంగాల్ మూడో స్థానంలో నిలవడమే అందుకు కారణం. ఇక్కడ పైచేయి సాధించే పార్టీకి లోక్ సభలోనూ బలాబలాల పరంగా ప్రత్యేక స్థానం ఉంటుంది.