చెన్నైలోని అన్నాసలైలో ఉన్న పెరియార్ విగ్రహంపై గుర్తుతెలియని వ్యక్తి ఒకరు తన చెప్పులను విసిరారు. సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. పోలీసులు దర్యాప్తు చేపట్టి..ఘటనకు కారణమైన అగంతకుడిని అరెస్టు చేసినట్లు సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెరియార్‌గా ప్రసిద్ధికెక్కిన ఈరోడ్ వెంకటప్ప రామస్వామి జయంతి నేడు. పెరియార్ జయంతి సందర్భంగా నేడు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు.


రిపోర్టుల కథనం మేరకు..అన్నాసలైలో పెరియార్ విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఒకరు తన చెప్పులను విగ్రహంవైపు విసిరాడు. ఈ దాడిలో పెరియార్ విగ్రహం స్వల్పంగా ధ్వంసమైంది. అక్కడే ఉన్న పోలీసులు అతడ్ని వెంటనే పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు స్టేషన్‌కి తరలించి అతడ్ని విచారిస్తున్నారు.


విదుతలై చిరుతైగల్ కట్చి నాయకుడు తిరుమావళవన్, అతడి అనుచరులు ఈ దాడి ఘటనను నిరసిస్తూ అక్కడే భైఠాయించారు. అతడ్ని వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు.


పెరియార్‌పై జరిగిన దాడి యావత్ తమిళులకు జరిగిన అవమానంగా అభివర్ణించారు తమిళనాడు మత్స్య శాఖ మంత్రి డి. జయకుమార్. ఘటనను కారకులైన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని, నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు.


రిపోర్టుల కథనం మేరకు.. ఇలాంటి ఘటనే చెన్నైలోని తిరుప్పూర్‌లో చోటుచేసుకుంది. అక్కడ కూడా గుర్తుతెలియని వ్యక్తి ఒకరు ఈ ఉదయం పెరియార్ విగ్రహంపైన చెప్పులను ఉంచారు. డీకె, డీఎంకె పార్టీలు ఘటనకు కారకులైన వారిని అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు.