మావాడే అయినా క్షమాపణ చెప్పాల్సిందే..!
కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ భారత ప్రధాని నరేంద్ర మోదీని `నీచుడు` అని సంబోధించిన క్రమంలో.. ఆ పార్టీపై దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తాయి.
కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ భారత ప్రధాని నరేంద్ర మోదీని "నీచుడు" అని సంబోధించిన క్రమంలో.. ఆ పార్టీపై దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తాయి. బీజేపీ నేతలు సోషల్ మీడియాలో అయ్యర్‌పై, కాంగ్రెస్ పార్టీపై భారీస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎట్టకేలకు ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పెదవి విప్పారు.
"బీజేపీతో పాటు భారత ప్రధాని కూడా అనేకసార్లు ఎంతో అసభ్యకరమైన పదజాలంతో కాంగ్రెస్ పార్టీని దూషించారు.. నిందించారు కూడా. అయితే కాంగ్రెస్ సంప్రదాయం వేరు. ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడినా మేము కచ్చితంగా ఖండిస్తాం. భారత ప్రధాని పట్ల అయ్యర్ వాడిన మాటలను, పదాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సమర్థించదు. అందుకే కాంగ్రెస్ పార్టీతో పాటు నేను కూడా అయ్యర్‌ను ప్రధానికి క్షమాపణ చెప్పాల్సిందిగా అడుగుతున్నాను" అని తెలిపారు.
రాహుల్ ప్రకటన వెలువడ్డాక.. మణిశంకర్ అయ్యర్ భారత ప్రధానికి క్షమాపణ చెప్పారు. తనకు హిందీ రాకపోవడం వల్లే ఈ పొరపాటు జరిగిందని, చాలా తక్కువ స్థాయిలో వారు ప్రవర్తిస్తున్నారన్న కోణంలో తాను మాట్లాడానని.. కాకపోతే అది వేరే విధంగా అర్థం అవుతుందని తాను అనుకోలేదని వివరణ ఇస్తూ, అయ్యర్ ప్రధానికి క్షమాపణ చెప్పారు.
ఈ రోజు బీజేపీ ప్రభుత్వాన్ని తూర్పారపడుతూ, వారి తప్పులను ఎత్తిచూపించే క్రమంలో అయ్యర్ ప్రధానిని "నీచ్" అనే పదంతో సంబోధించారు. అయితే ఆ సంబోధనకు భారత ప్రధాని చాలా కూల్‌గా సమాధానం ఇచ్చారు. "అవును నాది నీచజాతే.. దళితులు, బడుగువర్గాలు, గిరిజనులు మొదలైన వారి కోసమే నా జాతి పోరాడుతుంది. వారి భాషను వారి దగ్గరే పెట్టుకోమంటాను. మా పని మేము చేసుకుంటూనే ముందుకు వెళ్తాం" అని ప్రధాని తెలిపారు.