మక్కా మసీదు పేలుళ్ల కేసులో అందరూ నిర్దోషులే.. ఎన్ఐఏ కోర్టు తీర్పు
మక్కా మసీదు పేలుళ్ల కేసులో నాంపల్లి ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం తుది తీర్పును వెల్లడించింది.
మక్కా మసీదు పేలుళ్ల కేసులో నాంపల్లి ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం తుది తీర్పును వెల్లడించింది. మక్కా మసీదు పేలుళ్ల కేసును కొట్టివేస్తూ నాంపల్లి ఎన్‌ఐఎ కోర్టు తీర్పు చెప్పింది. నిందితులపై నేరాలను నిరూపించడానికి ఆధారాలు చూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు పేర్కొంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామి ఆసీమనందాను కూడా నిర్దోషిగా కోర్టు పేర్కొంది. నిందితులుగా ఉన్న అందరిని నిర్దోషులుగా కోర్టు ప్రకటిస్తూ కేసు కొట్టేసింది.
మొత్తం 10 మంది నిందితుల్లో ఒకరి హత్య జరగగా, ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. ప్రతీకారంతో పేలుళ్లు జరిగాయని అభియోగపత్రాలు దాఖలయ్యాయి. ఐదుగురు నిందితుల పేర్లను మాత్రమే చార్జీషీట్‌లో ఎన్‌ఐఏ చేర్చింది. ఈ కేసులో ఈ రోజు నాంపల్లి ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం తుది తీర్పు వెల్లడించింది. తీర్పు నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు నాంపల్లి కోర్టు, పాతబస్తీ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
2007 మే 18న శుక్రవారం మధ్యాహ్నం జుమా పార్థనల సమయంలో చార్మినార్ సమీపంలోని మక్కామసీదు ప్రాంగణంలోని వజూఖానా వద్ద ఐఈడీ బాంబ్ పేలడంతో తొమ్మిది మంది మృతిచెందగా.. 58 మంది గాయపడ్డారు. ఈ ఘటనలపై తొలుత హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, కేసు తీవ్రత దృష్ట్యా సీబీఐ దర్యాప్తు చేపట్టింది. అయితే ఇది ఉగ్రవాద చర్య కావడంతో 2011లో హోంశాఖ ఈ కేసును ఎన్‌ఐఏకి అప్పగించింది. ఇక ఈ కేసులో కీలక ఆధారాలను గుర్తించిన ఎన్ఐఏ, నిందితులను గుర్తించడంతో పాటు అభియోపత్రాలను కూడా దాఖలు చేసింది.