థానే: పబ్‌జి మొబైల్ గేమ్ ప్రాణాలను హరిస్తోంది. పబ్‌జికి బానిసలైన వారు ఆ గేమ్‌ని ఆడకుండా ఉండలేకపోతున్నారు. పబ్‌జికి బానిసలైన కొందరు.. ఆ గేమ్ ఆడొద్దని వారించినందుకు ఆత్మహత్యకు పాల్పడటమో లేక వారించిన వారిని హతమార్చుతున్నటువంటి ఘటనలు ఇటీవల తరచుగా చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ కోవలోనే తాజాగా మహారాష్ట్రలోని థానె జిల్లా భీవండిలో మరో ఘటన వెలుగుచూసింది. పబ్‌జి గేమ్ ఆడొద్దని వారించినందుకు ఓ బాలుడు తన సొంత అన్ననే హత్య చేశాడు. 


భీవండికి చెందిన ఓ 15 ఏళ్ల బాలుడు శనివారం ఉదయం తన అన్న మహమ్మద్ షేక్ (19)కి చెందిన స్మార్ట్‌ఫోన్‌లో పబ్‌జి మొబైల్ గేమ్ ఆడుతూ కనిపించాడు. అది చూసిన మహ్మద్ షేక్.. సోదరుడిని ఆ గేమ్ ఆడొద్దని వారించాడు. దీంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన ఆ బాలుడు తన అన్న తలను గోడకు కొట్టి.. అనంతరం అతన్ని పక్కనే ఉన్న కత్తెరతో పొడిచాడు. సోదరుడి దాడిలో తీవ్రంగా గాయపడిన అన్నను హాస్పిటల్‌కు తరలించినప్పటికీ.. అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్దారించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.