తుపాకులతో వచ్చి, బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్లిన దుండగులు
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల రీపోలింగ్‌లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు
పశ్చిమ బెంగాల్‌లో ఇవాళ జరిగిన పంచాయతీ ఎన్నికల రీపోలింగ్‌లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మాల్డా జిల్లాలో ఇవాళ ఉదయం రీపోలింగ్ జరుగుతున్న సమయంలోనే అక్కడికి చేరుకున్న గుర్తుతెలియని దుండగులు కొంతమంది ఏకంగా బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్లారు. పలు జిల్లాల్లో చెదురు ముదురు హింసాత్మక ఘటనలు జరగడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్), పోలీసు బెటాలియన్స్ లాఠీ చార్జ్ చేసి అల్లరి మూకలను చెదరగొట్టారు. మాల్డా జిల్లాలోని రత్వా 76వ పోలింగ్ బూత్ లో రీపోలింగ్ జరుగుతుండగా కొంతమంది దుండగులు ఆయుధాలతో అక్కడికి వచ్చారు. అనంతరం పోలింగ్ బూత్ సిబ్బందిని బెదిరించి బ్యాలెట్ బాక్సులతో అక్కడి నుంచి పరారైనట్టుగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పేర్కొంది.
బ్యాలెట్ బాక్సులతో వెళ్తున్న దుండగుల చేతుల్లో తుపాకులు వుండటం ఈ వీడియోలో గమనించొచ్చు. ఈ వీడియో చిత్రీకరించిన వ్యక్తిపై సైతం సదరు దుండగులు బెదిరింపులకు పాల్పడినట్టు సమాచారం.