బీఫ్ తినడం మానేస్తే.. మూక హత్యలు తగ్గుతాయి
బీఫ్ తినడం మానేస్తే.. మూక హత్యలు వంటివి తగ్గుతాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కీలక నేత ఇంద్రేష్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
బీఫ్ తినడం మానేస్తే.. మూక హత్యలు వంటివి తగ్గుతాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కీలక నేత ఇంద్రేష్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో జగ్రాన్ హిందూ మంచ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఇంద్రేష్ సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అల్వార్‌లో జరిగిన ఘటనపై స్పందించారు.
ఆవును చంపమని ఏ మతం చెప్పదని అన్నారు. ఎప్పుడైతే ఆవులను చంపడం (గోవధ) ఆపేస్తారో అప్పుడే దేశంలో జరుగుతున్న దాడులకు ఫుల్‌స్టాప్ పడుతుందని అన్నారు. ‘క్రైస్తవులు ఆవును గోమాతగా పిలుస్తారు. ఎందుకంటే యేసుక్రీస్తు పశువుల పాకలో జన్మించాడు కాబట్టి. మక్కా-మదీనాలో ఆవులను చంపడంపై నిషేధం ఉంది. ఎప్పుడైతే గోవధను నిషేధించి, పూర్తిస్థాయిలో పాటిస్తారో అప్పుడే ఈ సమస్య (మూకదాడులు)కు ఫుల్‌స్టాప్ పడుతుంది’ అని ఆరెస్సెస్ నేత ఇంద్రేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. అటు స్వామి అగ్నివేశ్‌పై జరిగిన దాడిని ఇంద్రేష్ ఖండించారు. ఇంద్రేష్ కుమార్ ఇటివంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. ఆయన గతంలో పాకిస్థాన్‌లోని లాహోర్‌లోకి భారత ఆర్మీ ఎప్పుడైనా ప్రవేశిస్తుందని వ్యాఖ్యానించారు.
మరోవైపు 'ముస్లింలు గో మాంసం తినడం ఆపాలని.. ఆవులు చంపడం మానుకోవాలని.. గోవులను చంపే వారికి కఠినమైన శిక్షలను వేయాలని ఉత్తర ప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ వసీం రిజ్వి అన్నారు.
హిందువుల మనోభావాలను అర్థం చేసుకొని ఆవుల అక్రమ రవాణాను ఆపాలని ముస్లింలను అభ్యర్థిస్తున్నానని రాజస్థాన్ మంత్రి జస్వంత్ యాదవ్ అన్నారు. అల్వార్‌లో జరిగిన ఘటనను ఖండిస్తూ.. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోరాదని కోరారు. కాగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కీలక నేత ఇంద్రేష్ కుమార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ హుస్సేన్ దల్వాయి తప్పుబట్టారు.