ముంబయిలో కొత్త విమానాశ్రయానికి మోదీ శంకుస్థాపన
భారత ప్రధాని నరేంద్ర మోదీ నవీ ముంబాయి ప్రాంతంలోని కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకి ఈ రోజు శంకుస్థాపన చేశారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ నవీ ముంబాయి ప్రాంతంలోని కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకి ఈ రోజు శంకుస్థాపన చేశారు. ఈ ఎయిర్ పోర్టును రూ.16700 కోట్లతో నిర్మించనున్నారు. ముంబయిలో ఇప్పటికే ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ప్రతీ రోజు రద్దీ విపరీతంగా ఉంటోంది. ఆ రద్దీ రోజు రోజుకీ పెరగడంతో ప్రత్యామ్నాయం కోసం మరో ఎయిర్ పోర్టు నిర్మించాలన్న ప్రతిపాదన చాలా రోజుల క్రితమే వచ్చింది.
ఈ క్రమంలో ఈ కొత్త ఎయిర్ పోర్టు ప్రాజెక్టు పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జీవీకే గ్రూప్, సిడ్కో కంపెనీలు ఈ ప్రాజెక్టునుటేకప్ చేశాయి. ప్రస్తుతం ఛత్రపతి శివాజీ ఎయిర్ పోర్టులో ప్రతీరోజు దాదాపు వెయ్యి విమానాలు సేవలు అందిస్తున్నాయి. అయితే ఒకే రన్ వే పై ఈ విమానాలు నడుస్తుండడంతో.. మరో ఎయిర్ పోర్టును కూడా నిర్మించడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది.
ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావుతో పాటు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి స్థానిక శివసేన నాయకులను ఆహ్వానించలేదని ఆ పార్టీ నాయకులు మండిపడ్డారు. తాము సైతం ఈ ఎయిర్ పోర్టు ప్రాజెక్టును స్వాగతిస్తున్నామని.. అయితే ప్రభుత్వం శివసేనకు సంబంధించిన స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలను మరిచిపోవడం శోచనీయం అని తెలిపారు.