గాంధీ జయంతి నుంచి మోడీ టీం `పాదయాత్ర` బాట
భారత ప్రధాని నరేంద్ర మోడీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ప్రధాని నరేంద్ర మోడీ టీం 'పాదయాత్ర' బాట పట్టనుంది. ఇదేంటి అధికార పార్టీ నేతలు పాదయాత్ర చేయడమేంటని ఆశ్చర్య పోకండి..ఇది నిజం నమ్మసక్యంగా లేకపోతే వివరాల్లోకి వెళ్లండి మరి...!!
జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని బీజేపీ ఎంపీలు ఒక్కొక్కరు 150 కి.మీ పాదయాత్ర చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. మంగళవారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఎంపీలను కోరారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాకు తెలిపారు.
పాదయాత్ర గురించి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ బీజేపీకి చెందిన ప్రతి ఎంపీ తమ తమ నియోజకవర్గాల్లో గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2 నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అయిన అక్టోబర్ 31 మధ్య ఒక్కో రోజు 15 కి.మీ చొప్పున మొత్తం 150 కి.మీ పూర్తి చేయాలని తెలిపారు. అలాగే రాజ్యసభ సభ్యులు గురించి ప్రస్తావిస్తూ పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో యాత్ర చేపట్టాలని కోరారు.
పాదయాత్రలో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ పాదయాత్ర సందర్భంగా గ్రామాల్లో మొక్కలు నాటడం, ప్రకృతి వ్యవసాయంపై ప్రజల్లో అవగాహన పెంచాలని మోదీ ఆదేశించినట్లు తెలిపారు. అలాగే జాతీయపిత ఆశించిన గ్రామ స్వరాజ్యం సిద్ధాంతం మేరకు గ్రామాల స్వయం సమృద్ధిపై దృష్టి సారించేలా యాత్ర కు సంబంధించిన కార్యాచరణని రూపొందించామని కేంద్ర మంత్రి జోషి తెలిపారు.