హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానుంది. దేశంలోనే తొలిసారిగా ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ సదస్సు-2018ను హెచ్‌ఐసీసీ వేదికగా సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. సదస్సును నాస్కాం- రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సదస్సుకు కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌, సీఎం కేసీఆర్‌లతో పాటు 30దేశాలకు చెందిన 2500 మందికి పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. వీరిలో అగ్రశ్రేణి కంపెనీలకు చెందిన 20 మంది సీఈవోలు ఉన్నారు. సదస్సులో డిజిటల్‌ పరిజ్ఞానాన్ని విస్తృతం చేయడం శీర్షికతో చర్చగోష్టులు నిర్వహించనున్నారు. డిజిటల్ గ్రామస్థులతో ఐటీ దిగ్గజాలు ముచ్చటించనున్నారు. 50కి పైగా ప్లీనరీలు, 150 మంది ప్రముఖులు ప్రసంగించనున్నారు. ఫైబర్‌ గ్రిడ్‌ ద్వారా కలిగే ఫలితాలను తెలంగాణ ప్రభుత్వం పరిచయం చేయనుంది. ఈ కార్యక్రమంలో సౌదిఅరేబియాకు చెందిన సోఫియా అనే రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.  


గత 40 సంవత్సరాలుగా ఈ సదస్సులను వివిధ దేశాల్లో నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో వస్తున్న మార్పులు, ఎదురవుతున్న సవాళ్లు తదితర అంశాలపై ఇందులో చర్చిస్తారు. గతేడాది ప్రపంచ ఐటీ సదస్సును తైవాన్ లో నిర్వహించారు.