గోవుల కోసం మంత్రిత్వ శాఖ పెట్టాల్సిందే: మధ్యప్రదేశ్ మంత్రి
గోసంరక్షణ కోసం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసుకోవాల్సిందేనని ఆ రాష్ట్ర గోసంరక్షణ బోర్డు ఛైర్మన్ మరియు క్యాబినెట్ మంత్రి హోదా కలిగిన వ్యక్తి అఖిలేశ్వరానంద్ సూచించారు.
గోసంరక్షణ కోసం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసుకోవాల్సిందేనని ఆ రాష్ట్ర గోసంరక్షణ బోర్డు ఛైర్మన్ మరియు క్యాబినెట్ మంత్రి హోదా కలిగిన వ్యక్తి అఖిలేశ్వరానంద్ సూచించారు. "స్వయంగా రైతు కుటుంబం నుండి వచ్చిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయంలో మమ్మల్ని ప్రోత్సహించాలి. గోసంరక్షణ కోసం నడుం బిగించాలి. అందుకోసం మేము పూర్తి సహకారం ఇస్తాం.
ప్రజలు కూడా తమ సహకారాన్ని అందిస్తారు" అని అఖిలేశ్వరానంద్ తెలిపారు. 2017లో విశ్వహిందూ పరిషత్ కూడా అచ్చం ఇలాంటి ప్రకటనే చేసింది. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తప్పనిసరిగా గోసంరక్షణ కోసం మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది. అలాగే 2013లో రాజస్థాన్‌లో బీజేపీ పార్టీ తమ మేనిఫెస్టోలో కూడా గోసంరక్షణ కోసం మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని తెలియజేయడం జరిగింది.
తాజాగా అఖిలేశ్వరానంద్ చేసిన సూచనపై ట్విట్టర్‌లో చాలామంది నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయని.. వాటి గురించి ముందు మంత్రులు పట్టించుకుంటే మంచిదని హితవు పలికారు.
రోడ్డు మీద తిండి లేక సంచరించే ఆవులు, గేదెలను కాపాడి.. ఆ తర్వాత గోసంరక్షణ గురించి మాట్లాడమని పలువురు నెటిజన్లు సూచించారు. అలాగే మరికొందరు నెటిజన్లు రాష్ట్రంలో కనీసం తలదాచుకోవడానికి కూడా చోటు లేక రోడ్డు మీద పడుండే వారిని ఆదుకొని.. వారికి ఉపాధి కల్పించమని.. ఆ తర్వాత ఇలాంటి సూచనలు చేయమని తెలిపారు.