తన మొబైల్ చోరీ చేయడానికి యత్నించిన ఓ దొంగ బారి నుంచి ఆ మొబైల్ ఫోన్‌ని కాపాడుకునే ప్రయత్నంలో రైల్లోంచి దూకిన ఓ వ్యక్తి ఆస్పత్రికి తరలించేలోగా కన్నుమూశాడు. ఆగస్టు 19న ముంబైలోని కల్వా స్టేషన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రమాదవశాత్తుగా చనిపోయిన వ్యక్తిని నాశిక్‌కి చెందిన చేతన్ అహిర్ రావు(35)గా పోలీసులు గుర్తించారు. చేతన్ అహిర్ రావు కల్వా స్టేషన్ నుంచి థానె జిల్లాలోని దివా స్టేషన్‌కి వెళ్లెందుకు లోకల్ ప్యాసింజర్ రైలు ఎక్కాడు. కల్వా స్టేషన్ నుంచి రైలు కదులుతుండగా ఫుట్‌బోర్డ్ పైనే నిల్చున్న చేతన్ మొబల్‌ని దొంగిలించేందుకు సోలంకి(19) అనే దొంగ అతడి చెయ్యిపై బలంగా కొట్టాడు. సోలంకి దాడి నుంచి మొబైల్‌ను కాపాడుకునే క్రమంలో చేతన్ తనకి తెలియకుండానే రైల్లోంచి దూకి పట్టాలపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన చేతన్‌ని ఆస్పత్రికి తరలించేలోపే తుదిశ్వాస విడిచాడు. మరోవైపు సోలంకి ఆ మొబైల్ తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.


ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మొదట చేతన్ ప్రమాదవశాత్తుగా రైలు నుంచి జారి కిందపడి మృతిచెందాడనే భావించారు. అయితే, అతడి వద్ద మొబైల్ ఫోన్ కనిపించకపోవడంతో అనుమానంతో కల్వా స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. సీసీటీవీ దృశ్యాల్లో చేతన్ మొబల్‌ని సోలంకి చోరీచేసేందుకు యత్నించడం, ఆ క్రమంలోనే చేతన్ రైల్లోంచి పడిపోయిన దృశ్యాలన్ని రికార్డ్ అయ్యాయి. దీంతో సోలంకిని గుర్తించిన పోలీసులు మరునాడే కళ్యాణ్ రైల్వే స్టేషన్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. సోలంకిపై చోరి, దాడి, హత్య నేరాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.