డబుల్ మర్డర్ కేసులో ఖైదీగా జైలులో శిక్ష అనుభవిస్తోన్న పింటూ తివారి అనే షార్ప్ షూటర్ అదే జైలులో ఘనంగా బర్త్ డే పార్టీ చేసుకున్న ఘటన బీహార్‌లోని సితామరి జైలులో చోటుచేసుకుంది. దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. 2015లో బీహార్‌లోని దర్భంగలో ఇద్దరు ఇంజనీర్లను హత్య చేసిన కేసులో పింటూ తివారి జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. పోలీసుల రికార్డులలో హిస్టరీ షీటర్‌గా పేరున్న పింటూ తివారి జైలులో కేక్ కట్ చేయగా అతడికి తోటి ఖైదీలు పుట్టిన రోజు మహుమతులు అందచేయడాన్ని పరిశీలిస్తే, అక్కడి జైలులో ఖైదీలకు, జైలు సిబ్బందికి మధ్య ఎంత సత్సంబంధాలు ఇట్టే అర్థమైపోతుంది. పింటూ తివారి బర్త్ డే పార్టీలో తోటి ఖైదీలకు మటన్‌తో విందు ఏర్పాటు చేయగా.. ఆ విందులో పాల్గొన్న ఖైదీలు మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతుంటడాన్ని ఫోటోల్లో గమనించొచ్చు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డబుల్ మర్డర్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి సిబ్బంది అందిస్తున్న ఈ రాజభోగాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటికి రావడంతో పింటూ తివారి బర్త్ డే పార్టీ కాస్తా జైలు అధికారుల మెడకు చుట్టుకుంది. దీంతో జైలులో నలుగురు సెక్యురిటీ గార్డులను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.