భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గురువారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సాయంత్రం 5: 05 నిమిషాలకు కన్నుమూశారు. వాజ్‌పేయి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గౌరవార్థం ఈ నెల 16 నుంచి 22వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఏడు రోజులపాటు సంతాప దినాలను పాటించాలని కేంద్రం ప్రకటించింది. ఇదిలా ఉండగా.. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ పలువురు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. మాజీ ప్రధాని, బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అటల్ బిహారీ వాజ్‌పేయి మృతితో కమలనాథులు దుఃఖసాగరంలో మునిగిపోయారు.


నా తండ్రిని కోల్పోయాను: ప్రధాని మోదీ


అటల్‌జీ మరణం తనకు తీరని లోటని, తాను తండ్రిని కోల్పోయినట్లు ఉందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. బీజేపీని ఇంటింటికీ తీసుకెళ్లిన ఘనత వాజ్‌పేయిదేనని కొనియాడారు. దేశం అమూల్యమైన రత్నాన్ని కోల్పోయిందన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చిన మహానేత అని భావోద్వేగపూరిత ప్రసంగంలో పేర్కొన్నారు. జననేత, గొప్ప వక్త, కవి, పాత్రికేయుడని... ఆయన మృతి ఓ యుగం ముగిసిపోయిందన్నారు.


అటల్‌జీ తనకు తండ్రిలా మార్గదర్శనం చేసేవారన్నారు. ఎప్పుడూ కలిసినా.. తండ్రిలా ఆత్మీయతను పంచేవారని.. ఆలింగనం చేసుకునేవారన్నారు. ఆయన జీవనం, ఆలోచనలు దేశం కోసమేనని.. నిరంతరం స్ఫూర్తిని రగిలిస్తూనే ఉంటాయన్నారు. అటల్‌జీ భౌతికంగా దూరమైనా ఆయన వ్యక్తిత్వం, తేజస్సు, కీర్తి భారతీయులకు ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తోందన్న మోదీ.. ఆయన లేని లోటు పూడ్చలేనిదంటూ.. శిరస్సు వంచి ఆయనకు నివాళులు అర్పిస్తున్నానన్నారు.