అహ్మదాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోడీ తన రెండు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్ రాష్ట్రాన్ని సందర్శించారు. అక్కడ తొలుత వాద్ నగర్ ప్రాంతంలో తను చదువుకున్న పాఠశాలను సందర్శించిన మోడీ ఆ తర్వాత అక్కడ జీఎంఈఆర్‌ఎస్ మెడికల్ కళాశాలకు కూడా శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత మిషన్ ఇంద్రధనుష్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మోడీ, ఆ పథకం ప్రాధాన్యాన్ని తెలుపుతూ, ఆరోగ్య రంగం ఉన్నతికి వైద్యులు నిజాయితీతో పనిచేయాలని ఆకాంక్షించారు. అలాగని ప్రజలు అన్నింటికీ వైద్యుల మీదే ఆధారపడకూడదని, ఎవరి ఆరోగ్యాన్ని వారు సంరక్షించుకోవడానికి ప్రయత్నించాలని, అందుకు మంచి ఆహారపు అలవాట్లను కూడా పెంపొందించుకోవాలని ఆయన తెలిపారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత అనేది పాటించాలని, దాని ప్రాముఖ్యతను తెలియజేసేందుకే ప్రభుత్వం స్వచ్ఛభారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని  ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

- ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం ఆరోగ్య సేవలను పేద ప్రజలకు మరింత చేరువ చేసేందుకు గాను, ఆ సేవల రుసుమును తగ్గించేందుకు గాను ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని మోడీ తెలియజేశారు


-యూపీఏ హయంలో ప్రభుత్వాలు కనీసం ఆరోగ్య పరిరక్షణ నిమిత్తం ఎలాంటి ఆలోచనలు చేయలేదని ఆయన అభిప్రాయపడ్డారు.


-అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలోనే తొలిసారిగా ఆరోగ్య పాలసీల విషయమై పనులు వేగవంతమయ్యాయని, ఆ తర్వాత వచ్చిన యూపీఏ ప్రభుత్వం ఆ పాలసీల విషయాన్ని అసలు పట్టించుకోలేదని అన్నారు 


-మిషన్ ఇంద్రధనుష్ పథకం ద్వారా గ్రామ, పట్టణ ప్రాంతాల్లో టీకాలు, వ్యాక్సిన్లు అందరికీ అందేలా పూర్తిస్థాయిలో కార్యచరణ సిద్ధంగా ఉందని, అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.