ప్రముఖ మాజీ క్రికెటర్, ప్రస్తుత పంజాబ్ రాష్ట్ర మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూకి జైలు శిక్ష తప్పదా అంటే అవుననే తెలుస్తోంది. 1998 నాటి ర్యాష్ డ్రైవింగ్ కేసులో అప్పట్లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ జరిమానా చెల్లించి తాత్కాలిక ఉపశమనం పొందారు. అయితే, ఆ కేసులో సుప్రీం కోర్టు తాజాగా ఆయనకు జైలు శిక్ష విధించే అవకాశాలున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇంకాసేపట్లో పూర్తి వివరాలతో ఈ న్యూస్ అప్‌డేట్ చేయడం జరుగుతుంది.


20 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. అయితే, ఈ కేసులో నవజ్యోత్ సింగ్ సిద్ధూ నేరస్తుడు అనడానికి తగిన ఆధారాలు ఏవీ లేవనే కారణంతో మే నెలలో సుప్రీం కోర్టు సిద్ధూకి రూ.1000 జరిమానా విధించి అతడిని నిర్ధోషిగా వదిలేసింది. జస్టిస్ జాస్తి చలమేశ్వర్(ప్రస్తుతం పదవీవిరమణ పొందారు), జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్‌ల కూడిన ధర్మాసనం సిద్ధూని నిర్ధోషిగా వదిలేసింది. అయితే, సుప్రీం కోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తంచేసిన బాధితుడి కుటుంబం.. మరోసారి సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ రివ్యూ పిటిషన్ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు మరోసారి నవజ్యోత్ సింగ్ సిద్ధూ కేసుపై దృష్టిసారించనున్నట్టు సమాచారం. 1998నాటి కేసులో సిద్ధూ నేరస్తుడేనా కాదా అనే కోణంలో కోర్టు మరోసారి ఈ కేసును రీఓపెన్ చేసేందుకు సిద్ధమైంది. ఈ కేసులో సిద్ధూని తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసినట్టు తెలుస్తోంది.