అయోధ్యలోని రామ జన్మభూమి- బాబ్రీ మసీదు స్థల వివాదం కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన ఈ కేసు మళ్లీ వాయిదా పడింది. రాజ్యాంగ ధర్మాసనంలోని సభ్యుడైన జస్టిస్‌ లలిత్‌  విచారణ నుంచి తప్పుకున్న నేపథ్యంలో ఈ కేసు విచారణ వాయిదా వేశారు. విచారణ కోసం కొత్త రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుచేస్తామని పేర్కొన్న ధర్మాసనం...ఈ కేసును జనవరి 29కి వాయిదా వేసింది


అయోధ్య కేసు విచారణను ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలో న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌.ఎ. బోబ్డే, జస్టిస్‌ ఎన్‌.వి. రమణ, జస్టిస్‌ యు.లలిత్‌, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌లతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది.  బెంచ్‌లో జస్టిస్‌ లలిత్‌ ఉండటంపై ఈ కేసును వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాది రాజీవ్‌ ధవన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. జస్టిస్‌ లలిత్‌ గతంలో ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యూపీ మాజీ సీఎం కల్యాణ్‌సింగ్‌ తరఫున వాదించిన నేపథ్యంలో రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్‌ లలిత్‌ సభ్యులుగా ఉండటంపై న్యాయవాది ధవన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో జస్టిస్ లలిత్‌ విచారణ నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.