ఫారుఖాబాద్: ఓ ప్రైవేటు ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్‌లో అప్పుడే పుట్టిన పసికందును కుక్క కరిచి చంపిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫరుఖాబాద్‌లో సోమవారం చోటుచేసుకుంది. ఫారుఖాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి ఆనుకునే ఉన్న ప్రైవేటు ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఈ దారుణం స్థానికంగా కలకలం సృష్టించింది. బాధిత కుటుంబం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆపరేషన్ థియేటర్‌లోంచి ఆస్పత్రి సిబ్బంది శునకాన్ని బయటికి తరమడం చూసి వెంటనే లోపలికి పరిగెత్తామని.. తీరా చూస్తే అక్కడ పసికందు నేలపై పడి ఉన్నాడని, పసికందు మెడచుట్టూ కుక్క కాటు గాయాలున్నాయని బోరుమన్నారు. అప్పటికే శిశువు మరణించినట్టు ఆస్పత్రి సిబ్బంది చెప్పారని పసికందు కుటుంబసభ్యులు తెలిపారు. శిశువు జన్మించగానే తల్లిని ఆపరేషన్ థియేటర్‌లోంచి వార్డులోకి తరలించిన సిబ్బంది.. శిశువును మాత్రం కాసేపు థియేటర్‌లోనే ఉంచాలని చెప్పారని.. ఆ తర్వాత మరో గంట వ్యవధిలోనే ఈ ఘటన జరిగిందని చెప్పి ఆ కుటుంబం బోరున విలపించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా శిశువు కుక్క కాటుకు గురై మృతిచెందాడని బాధితుల ద్వారా ఫిర్యాదు అందుకున్న జిల్లా మెజిస్ట్రేట్ మన్వెంద్ర సింగ్.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. ఈ ఘటనపై చీఫ్ మెడికల్ ఆఫీసర్ చంద్రశేఖర్ స్పందిస్తూ.. ఆస్పత్రిని సీల్ చేసి విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. సర్కార్ రికార్డుల్లో ఈ ఆసుపత్రి పేరు కూడా నమోదు కాలేదని తెలుస్తోంది. శిశువు మృతదేహాన్ని పోస్టు మార్టం, దర్యాప్తు కోసం భద్రపరిచామని సర్దార్ కొత్వాలి పోలీసులు వెల్లడించారు.


కాన్పు సమయంలో విధుల్లో ఉన్న డా మోహిత్ గుప్తతో పాటు పలువురిపై కేసు నమోదైంది. అయితే, ఆసుపత్రి యజమాని విజయ్ పటేల్ మాత్రం ఈ ఘటన గురించి తనకేమీ తెలియదని.. శిశువు పుట్టినప్పటికే చనిపోయి ఉన్నాడనే సిబ్బంది తనకు చెప్పారని నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం గమనార్హం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..