న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను రూ.13,500 కోట్ల మేర మోసం చేసిన కేసులో భారత్‌లో వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో వుండి లండన్‌కు పారిపోయిన నిరవ్ మోదీ తాజాగా లండన్ వీధుల్లో తిరుగుతూ అక్కడి మీడియా కంటపడ్డాడు. బ్రిటన్‌కి చెందిన ది టెలిగ్రాఫ్ అనే వార్తాపత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం లండన్‌లోని వెస్ట్ ఎండ్ ప్రాంతంలో 8 మిలియన్ పౌండ్స్ విలువచేసే ఖరీదైన అపార్ట్‌మెంట్స్‌లో 3 బెడ్ రూమ్ ఫ్లాట్‌లో నిరవ్ మోదీ నివాసం ఉంటున్నట్టు సమాచారం. ది టెలిగ్రాఫ్ కథనం ప్రకారం నిరవ్ మోదీ లండన్‌లోనూ వజ్రాల వ్యాపారం చేస్తున్నట్టు తెలుస్తోంది.  


లండన్ వీధుల్లో నిరవ్ మోదీని చూసిన ది టెలిగ్రాఫ్.. ప్రస్తుత పరిణామాలపై అతడిని ప్రశ్నించే ప్రయత్నం చేయగా నిరవ్ మోదీ మాత్రం నో కామెంట్ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ మేరకు నిరవ్ మోదీకి సంబంధించిన ఓ వీడియోను సైతం ఆ వార్తాసంస్థ విడుదల చేసింది. ఇప్పటికే నిరవ్ మోదీపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయగా.. అతడిని తమకు అప్పగించాల్సిందిగా కోరుతూ భారత సర్కార్ గతేడాది సెప్టెంబర్‌లో దాఖలు చేసిన పిటిషన్ ప్రస్తుతం బ్రిటన్ అధికార యంత్రాంగం పరిశీలనలో వుంది. పంజాన్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో నిరవ్ మోదీతోపాటు అతడి సమీప బంధువు మెహుల్ చోక్సీపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్న సంగతి తెలిసిందే.