న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార ఘటనలో ముద్దాయిలకు ఉరి శిక్ష అమలుపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది. నిందితులకు ట్రయల్‌ కోర్టు.. ఢిల్లీ హైకోర్టు ఖరారు చేసిన మరణ శిక్షలను గతేడాది మేలో సుప్రీం కోర్టు ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దోషులు ముఖేష్‌, పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మల తరపున పిటిషన్‌ దాఖలైంది. తమకు విధించిన ఉరి శిక్షను యావజ్జీవంగా మార్చాలని సుప్రీంను వారు పిటిషన్‌‌లో కోరారు. దీనిపై ధర్మాసనం నేడు తీర్పు వెలువరించనుంది.


కాగా రివ్యూ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ భానుమతి, జస్టిస్ అశోక్‌ భూషణ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టి, తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ముద్దాయిలకు మరణ శిక్షనే అమలు చేస్తారా? లేదా జీవిత ఖైదుగా మారుస్తారా? అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.