న్యూఢిల్లీ: విద్యుత్‌ ఉపకరణాల తయారీ రంగంలో దిగ్గజ సంస్థగా పేరున్న ఏబిబి ఇండియా లిమిటెడ్‌‌తో కలిసి నీతి ఆయోగ్ ఇవాళ ఓ సదస్సును నిర్వహించింది. వివిధ రంగాల్లో కృత్రిమ మేధస్సు ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై చర్చించేందుకు నీతి ఆయోగ్, ఏబిబి ఇండియా సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహించాయి. పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన కార్యనిర్వాహకులు, సాంకేతిక నిపుణులు ఈ సదస్సుకు హాజరయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అన్నిరంగాల్లోనూ కృత్రిమ మేధస్సు వినియోగం పెరగాలన్న లక్ష్యానికి మద్దతుగా బెంగుళూరులోని ఏబిబి ఎబిలిటి ఇన్నోవేషన్ సెంటర్ (ఏఐసి) వేదికగా జరిగిన ఈ సదస్సులో ఔషదాల తయారీ, జౌళి, విద్యుత్ ఉపకరణాలు, ఫుడ్ ప్రాసెసింగ్, తయారీరంగం నుంచి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు చెందిన వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. వారివారి రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం విషయంలో అమలులో వున్న చట్టాలు, ఆర్థికపరమైన సవాళ్లు, శిక్షణ వంటి అంశాలు చర్చకొచ్చాయి. వ్యాపారంలో సృజనాత్మకత, వ్యాపార సరళి, ఆర్థిక భారం తగ్గింపు వంటి అంశాలను సైతం సభ్యులు చర్చించారు. 


వర్క్‌షాప్ గురించి నీతి ఆయోగ్ సీనియర్ సలహాదారు అన్నా రాయ్ మాట్లాడుతూ.. ఎవరి గురించైతే చట్టాలను రూపొందిస్తున్నామో, వారికే నేరుగా లబ్ధి చేకూరేలా అన్ని రంగాల వారితో విస్తృత స్థాయి చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. అందులో భాగంగానే ఏబిబి ఇండియా నేతృత్వంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు చెందిన వ్యాపారవేత్తలు తమ తమ వ్యాపారాల్లో ఎదుర్కుంటున్న అవరోధాలు, ఆర్థిక సవాళ్లు, నైపుణ్యం కలిగిన సిబ్బందిలేమి వంటి సమస్యలపై దృష్టిసారించినట్టు వెల్లడించారు.