దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న నగదు కష్టాలపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమీక్షించారు. గత కొద్ది రోజులుగా ఏటీఎంలలో నగదు లేక జనం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి తమ దృష్టికి వచ్చిందన్నారు. 'అవసరం ఉన్నదానికన్నా దేశంలో ఎక్కువ కరెన్సీ అందుబాటులో ఉంది. బ్యాంకులకు కూడా సరిపడా నగదును పంపిణీ చేస్తున్నాం. ప్రస్తుతం ఏర్పడుతున్న నగదు కొరత తాత్కాలికమే.. డిమాండ్ పెరగడంతో ఈ పరిస్థితి వచ్చింది' అని ఆయన పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాలలో అనూహ్యంగా, అకస్మాత్తుగా నగదు విత్ డ్రాయల్స్‌లో అసాధారణ పెరుగుదల వల్ల ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని, కొరతపై ఆందోళన అవసరం లేదని భరోసా ఇచ్చారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


అటు దేశ వ్యాప్తంగా ఏటీఎంలో డబ్బులు లేకపోవడానికి కారణం బ్యాంకుల్లో డిపాజిట్లు గణనీయంగా తగ్గడమే అని ఆర్థిక శాఖ తెలిపింది. 2016- 2017 ఏడాది బ్యాంకుల్లో 15.3 శాతం డిపాజిట్లు పెరగ్గా.. 2017-18 ఏడాదిలో డిపాజిట్ల పెరుగుదల 6.7 శాతంగానే ఉందని వెల్లడించింది. చాలా మంది ప్రజలు డిపాజిట్లను ఉపసంహరించుకొని బంగారం, ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణాలపై పెట్టుబడులు పెడుతుండటంతో నగదు రొటేషన్ జరగడం లేదని పేర్కొన్నారు.