వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కూటమిలో చేరేందుకు మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ సహా అనేక రాజకీయ పార్టీలు సానుకూల సంకేతాలు ఇచ్చారని తమిళనాడు కాంగ్రెస్‌ అధ్యక్షుడు తిరునావుక్కరసర్‌ తెలిపారు. సోమవారం చెన్నైలో మాట్లాడిన ఆయన.. ఇటీవలే డీఎంకే-కాంగ్రెస్‌ మధ్య పొత్తు ఖరారైందని అన్నారు. టీటీవీ దినకరన్‌ నేతృత్వంలోని అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం, రాందాసు నేతృత్వంలోని పీఎంకే, తిరుమావళవన్‌ నేతృత్వంలోని వీసీకే కూడా తమతో కలిసి వచ్చేందుకు ఉన్నాయన్నారు. ఇప్పుడు కమల్‌ హాసన్ కూడా కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారని వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఏడాది జూన్ లో కమల్ హాసన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను కలిశారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్ కూటమితో చేతులు కలపాలా?వద్దా? అని ఆయన సమాలోచనలు చేస్తున్నారు. బీజీపీయేతర మిత్రులను కూడగట్టడం కోసం కమల్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆప్ అధినేత అర్వింద్ క్రేజీవాల్, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలను కలిశారు.


అటు తిరునావుక్కరసర్‌ వ్యాఖ్యలపై మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ స్పందించారు. కూటమిలో చేరేందుకు నేను ఎటువంటి సంకేతాలు పంపలేదని అన్నారు. ప్రస్తుతం పొత్తులపై ఆలోచనేమీ లేదన్నారు.  తిరునావుక్కరసర్‌ వ్యాఖ్యలను కొట్టిపారేశారు.