జలంధర్ నాయక్.. ఓ గిరిజనుడు... అంతకు మించి కనీస సదుపాయాలు కూడా లేని ఒక మారుమూల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న అతి సామాన్యుడు. అయినా మేధావిగానే ఆలోచించాడు. తనతో పాటు తనలాంటి తోటి గిరిజనుల బాధలను అర్థం చేసుకొని.. తన ఊరిని, పట్నంతో కనెక్ట్ చేసేందుకు ఒక రోడ్డు వేయాలని ఆలోచించాడు. అయితే అది సాధ్యమా..? ఎందుకంటే రెండింటికీ మధ్య ఓ చిన్న కొండ అడ్డుగా ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దానిని తొలిగిస్తే చాలు. తమ ఊరువాళ్లు సులువుగా పట్నానికి వెళ్లేదారి సుగమమవుతుంది. అందుకే అహర్నిశలు కష్టపడి.. ఆ కొండను తవ్వడానికి సిద్ధపడ్డాడు జలంధర్ నాయక్. చాలా సంవత్సరాలు కష్టపడి ఎట్టకేలకు ఆ కొండను తొలిగించి.. మార్గాన్ని కనిపెట్టాడు. దాదాపు 8 కిలోమీటర్లు ఉండే ఒక రోడ్డును కనీస ప్రభుత్వ సహాయం కూడా లేకుండా వేసుకున్న నాయక్ పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు పలువురు అధికారులు. 


"మా ఊరిలో కనీస సదుపాయాలు కూడా లేవు. పట్నం వెళ్లాలంటే కొండ చుట్టూ తిరిగి వెళ్లాలి. అందుకు ఎన్నిగంటలు పడుతుందో ఆ దేవుడికే ఎరుక. నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే ఒక గంపలో ఆమెను కూర్చోబెట్టి.. ఇద్దరం మనుష్యులం దానిని మోసుకుంటూ కొండ మొత్తం తిరిగి వెళ్లాం. అందుకు చాలా సేపు పట్టింది. మా ఊర్లో పాఠశాల లేదు. కనీసం అంగన్వాడి కూడా లేదు.


మరి మా పిల్లలు కూడా చదువుకోవాలి కదా. అధికారులను అడిగితే పట్టాలిస్తాం.. పట్నం వచ్చి బ్రతకండి అన్నారు. కానీ.. మమ్మల్ని కన్న ఊరు ఇది. దానిని వదిలి ఎలా రాగలం. అందుకే ఈ సమస్య తీరాలంటే. మా ఊరికి పట్నాన్ని దగ్గర చేయాలని భావించాను. అందుకే అసాధ్యమైనా.. అది సాధ్యపడేలా కొండను తవ్వి రోడ్డును వేశాం.అందుకు నాకు సహకరించిన వారందరికీ నా ధన్యవాదాలు" అని తెలిపారు జలంధర్ నాయక్. గుమ్సాసీ పల్లెకి చెందిన జలంధర్ పుల్బానీ.. ఆ పల్లెని పట్నానికి కనెక్ట్ చేసి రోడ్డు వేయడం ఇప్పటికే ప్రభుత్వ దృష్టిలో పడింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఏ పల్లెను పట్టించుకుంటుందో లేదో అన్నది భవిష్యత్తే చెప్పాలి.