చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా 1977 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి ఓం ప్రకాశ్ రావత్ నియమితులయ్యారు. ప్రస్తుత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అచల్ కుమార్ జ్యోతి రేపటి సోమవారం పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలోనే ఓం ప్రకాష్ రావత్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా నియమితులయ్యారు. మంగళవారం చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. మధ్యప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఓం ప్రకాశ్ రావత్ 2015 ఆగస్టులో ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. వచ్చే ఏడాది నవంబర్ వరకూ ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ పదవిలో కొనసాగుతారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


గడిచిన మూడు దశాబ్ధాల కాలంలో రావత్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాల్లో వివిధ హోదాల్లో సేవలు అందించారు. రక్షణ శాఖ, బారీ పరిశ్రమల శాఖల్లో పనిచేసిన రావత్ కి 2004 నుంచి 2006 మధ్య కాలంలో అప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి బాబూ లాల్ గౌర్ హయాంలో ప్రిన్సిపల్ సెక్రటరీగాను చేశారు. 


ఇదిలావుంటే, ముగ్గురు సభ్యులు కలిగిన భారత ఎన్నికల సంఘంలో రావత్ నియామకంతో ఖాళీ అయిన స్థానాన్ని అశోక్ లావసతో భర్తీ చేశారు. 1980 బ్యాచ్ హర్యానా క్యాడర్‌కి చెందిన అశోక్‌ని ఎలక్షన్ కమిషనర్‌గా నియమిస్తూ ఆదివారం సాయంత్రం ఆదేశాలు జారీ అయ్యాయి.