భారతీయ రైల్వే ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. రైల్వే ఉద్యోగులకు బోనస్‌గా 78 రోజుల జీతాన్ని ‘దసరా బోనస్‌’గా ప్రకటించింది. రైల్వే యూనియన్లతో చర్చల అనంతరం ఉత్పాదకత ఆధారంగా ఇచ్చే పీఎల్‌బీ(ప్రొడక్టివిటీ- లింక్డ్ బోనస్)బోనస్‌ను రైల్వే బోర్డు ప్రతిపాదించింది.  'ప్రస్తుతం ఈ  ప్రతిపాదన కేంద్ర మంత్రివర్గం వద్ద పరిశీలనలో ఉంది. త్వరలోనే మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.' అని ఐఏఎన్ఎస్ నివేదికలు పేర్కొన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీని ప్రకారం మొత్తం 12.26 లక్షల మంది ఉద్యోగులకు ఈ బోనస్ లభించనుంది. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ జనరల్ సెక్రెటరీ ఎం.రాఘవయ్య మాట్లాడుతూ, 'మేము 80 రోజుల జీతాన్ని బోనస్‌గా ఇవ్వాలని డిమాండ్ చేశాము. కానీ చివరకు 78 రోజుల బోనస్‌ను అంగీకరించాము.' అని వెల్లడించారు. గత ఆరు సంవత్సరాలుగా రైల్వే ఉద్యోగులు 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా పొందుతున్నారు. ఈ సంవత్సరం కూడా రైల్వే అదే సూత్రాన్ని అనుసరిస్తోంది.


ఈ బోనస్ నవరాత్రుల సమయంలో ప్రకటించబడుతుందని ఉద్యోగులు భావిస్తున్నారు. ఈ బోనస్‌తో ప్రభుత్వంపై 2,000 కోట్ల రూపాయల భారం పడనుంది. అర్హులైన ప్రతి రైల్వే ఉద్యోగికి దాదాపు రూ.18వేల బోనస్‌ లభించనుంది. గెజిటెడ్‌ ఉద్యోగులు, రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్ (RPF)‌, రైల్వే ప్రొటెక్షన్‌ స్పెషల్‌ ఫోర్స్‌ (RPSF)కు చెందిన ఉద్యోగులకు ఈ బోనస్‌ లభించదు.