హైదరాబాదు: 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు థర్డ్ ఫ్రంట్‌కు ఏర్పాటు దిశగా సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో.. మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. తెలంగాణ సీఎం ప్రకటనను స్వాగతించారు. ఒవైసీ ముఖ్యమంత్రికి మద్దతు తెలుపుతూ.. దేశంలోని ప్రజలు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లతో విసుగు చెందారని అన్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'నేను తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటనను స్వాగతిస్తున్నా. దేశంలోని ప్రజలు బీజేపీ పరిపాలనతో విసిగిపోతున్నారు. కాంగ్రెస్ కూడా ప్రత్యామ్నాయం కాదు' అని ఒవైసీ అన్నారు. కాంగ్రెస్ పాలనలో కూడా ప్రజలకు ఆశించినంత మేలు జరగలేదని చెప్పారు. ఈ క్రమంలోనే అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనను ప్రశంసించారు. 'గత నాలుగు సంవత్సరాల్లో తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ చక్కటి పాలనను అందించారు' అని కితాబిచ్చారు.


శనివారం కేసీఆర్, జాతీయ రాజకీయాల పట్ల తనకున్న ఆసక్తిని బయటకి చెప్పారు. భారత రాజకీయాల్లో మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. అవసరమైతే జాతీయ రాజకీయాల్లో వెళ్ళడానికి నేను సిద్ధమే. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయం రావాలి. ఫ్రంట్, కూటమిపై ఆలోచన జరగాలి. థర్డ్ ఫ్రంట్ కాదు.. మెయిన్ ఫ్రంట్ కావాలనన్నారు.


'జాతీయ రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. 70 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్య పాలనలో గుణాత్మకమైన మార్పులేవీ రాలేదు. ఇది చాలా దురదృష్టకరం. ప్రజలు మార్పును చూడాలనుకుంటున్నారు. బీజేపీ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్లయితే ఏదైనా కొత్తగా జరిగే అవకాశముంది' అని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.


'థర్డ్ ఫ్రంట్ లేదా ఏదైనా ఫ్రంట్ అవ్వచ్చు. చర్చలు ఇదే విధంగా కొనసాగుతాయి. రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చేందుకు నేను ప్రయత్నిస్తాను' అని కేసీఆర్ చెప్పారు.