Pakistan couple names newborn baby 'Border': పాకిస్తాన్‌కు చెందిన నీంబు భాయ్-బాలమ్ రామ్ (Nimbu Bai-Balam Ram) అనే హిందూ దంపతులు డిసెంబర్ 2న పుట్టిన తమ బిడ్డకు 'బోర్డర్' (Border) అని పేరు పెట్టుకున్నారు. సాధారణంగా ఎవరైనా... తమ పూర్వీకులు, ఇష్ట దైవం లేదా నచ్చిన వ్యక్తుల పేర్లు కలిసొచ్చేలా పిల్లలకు పేర్లు పెడుతుంటారు. కానీ ఈ దంపతులు బోర్డర్ అని పేరు పెట్టడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే దీని వెనకాల పెద్ద కథే ఉంది. ఈ బుడ్డోడు భారత్-పాక్ బోర్డర్‌లో పుట్టడం... ఆ బోర్డర్ దాటేందుకు కొన్ని నెలలుగా ఆ దంపతులు నిరీక్షిస్తున్న నేపథ్యంలో... ప్రతీకాత్మకంగా ఆ పసివాడికి 'బోర్డర్' అని పేరు పెట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాకిస్తాన్‌ పంజాబ్ (Pakistan) ప్రావిన్స్‌లోని రాజన్‌పురాకి చెందిన నీంబు భాయ్-బాలమ్ రామ్ దంపతులు హిందూ పుణ్యక్షేత్రాల (Hindu Temples) సందర్శనార్థం గతేడాది భారత్‌లో అడుగుపెట్టారు. కానీ ఇంతలోనే కరోనా కారణంగా భారత్‌లో లాక్‌డౌన్ ప్రకటించడం... పాకిస్తాన్ తమ సరిహద్దులను మూసివేయడంతో ఇక్కడే చిక్కుకుపోయారు. దీంతో దిక్కుతోచని స్థితిలో రాజస్తాన్‌‌లోని జైపూర్, జోధ్‌పూర్ ప్రాంతాల్లో కొన్నాళ్లు రాళ్లు కొడుతూ జీవనం సాగించారు.


కరోనా వ్యాప్తి (Covid 19) తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో తిరిగి తమ స్వదేశం పాకిస్తాన్ వెళ్లేందుకు ఈ ఏడాది సెప్టెంబర్‌లో అటారీ-వాఘా బోర్డర్‌కు (Attari Wagah border) చేరుకున్నారు. నీంబు భాయ్-బాలమ్ రామ్ దంపతులతో పాటు పాకిస్తాన్‌కు చెందిన మరో 97 మంది హిందువులు గత 3 నెలలుగా అదే బోర్డర్ వద్ద నిరీక్షిస్తున్నారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేవన్న కారణంతో పాకిస్తాన్ వీరిని స్వదేశంలోకి వచ్చేందుకు అనుమతి నిరాకరించింది. ఇటీవలే నీంబు భాయ్‌కి నెలలు నిండటంతో డిసెంబర్ 2న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. భారత్-పాక్ బోర్డర్‌లో పుట్టినందునా... ఆ పసివాడికి తల్లిదండ్రులు బోర్డర్ అని నామకరణం చేశారు.


'మా బిడ్డకు బోర్డర్ అని నామకరణం చేశాం. అటారీ-వాఘా ఇంటర్నేషనల్ బోర్డర్ వద్ద మేము పడుతున్న కష్టాలను ఆ పేరు ఎప్పటికీ గుర్తు తెస్తుంది.' అని బాలమ్ రామ్ పేర్కొన్నాడు. ఈ దంపతులకు ఇదివరకే నలుగురు పిల్లలు పుట్టగా... ఇందులో ఒకరు గతేడాది రాజస్తాన్‌లోని (Rajasthan) జోధ్‌పూర్‌లో జన్మించారు. వీసా గడువు దాటిపోవడం, భారత్ నుంచి ఎగ్జిట్ లెటర్, కొత్తగా పుట్టిన శిశువుకు డాక్యుమెంట్స్, కోవిడ్ 19 టెస్ట్ రిపోర్ట్స్.. ఇవేవీ లేకపోవడంతో వీరిని పాకిస్తాన్ (Pakistan) తమ దేశంలోకి అనుమతించట్లేదు. దీంతో అటారీ-వాఘా బోర్డర్ వద్ద టెంట్ల కిందే జీవనం సాగిస్తున్నారు. అక్కడి స్థానికులే వీరి అవసరాలను తీరుస్తున్నారు. అటు సొంత దేశం పాకిస్తాన్ తమను కనికరించని పరిస్థితుల్లో భారత్ తమ పట్ల చొరవ తీసుకుంటుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు.


Also Read: Vicky Katrina Wedding OTT Platform: విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్ పెళ్లి ఫుటేజ్ కోసం రూ.100 కోట్ల ఆఫర్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook