షాకింగ్ న్యూస్: పాక్ తీవ్రవాదులు ఉపయోగిస్తున్న బుల్లెట్లలో చైనా స్టీల్!
బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లని చీల్చుకు వెళ్లే సామర్థ్యం ఈ బుల్లెట్ల సొంతం.
జమ్మూకాశ్మీర్‌లోని సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి భారత్‌లోకి చొరబడి భారత సైనికులని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతున్న పాకిస్థానీ టెర్రరిస్టులు చైనాలో రూపొందిన స్టీలు బుల్లెట్లు ఉపయోగిస్తున్నట్టు తాజా నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. గతేడాది చివర్లో డిసెంబర్ 31న పుల్వామాలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ బలగాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఐదుగురు సైనికులని బలి తీసుకోవడం ఇండియన్ ఆర్మీ వర్గాలని నిర్ఘాంతపరిచింది. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించిన సీఆర్పీఎఫ్ జవాన్లు తీవ్రవాదుల బుల్లెట్ గాయాల కారణంగా మృతి చెందడంపై దర్యాప్తు చేపట్టిన అధికారులు.. పాక్ తీవ్రవాదులు ఉపయోగించిన బుల్లెట్లు చైనా స్టీల్‌తో రూపొందించినవని గ్రహించినట్టు తెలుస్తోంది.
సాధారణంగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాంటి ఉత్పత్తుల తయారీలో ఉపయోగించే పటిష్టమైన స్టీలుని పాక్ తీవ్రవాదులు ఉపయోగించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లని చీల్చుకు వెళ్లే సామర్థ్యం ఈ బుల్లెట్ల సొంతం. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బుల్లెట్ ఏ మాత్రం చెక్కు చెదరకుండా వుండగలగడం ఈ స్టీలుకు వున్న మరో ప్రత్యేకత. భారత నిఘావర్గాల ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం.. పాకిస్థాన్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలకు చైనా ఈ స్టీలుని సరఫరా చేస్తోంది. అలా పాక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలో రూపొందిన చైనా స్టీల్ బుల్లెట్లతో ఇండియన్ ఆర్మీ సైనికులపై దాడికి పాల్పడుతున్నాయి పాక్ తీవ్రవాద సంస్థలు.
దురదృష్టంకొద్దీ ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ సైనికులకు భారత ప్రభుత్వం సరఫరా చేస్తోన్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్‌కి స్టీలుని తట్టుకుని నిలిచే శక్తి, సామర్థ్యాలు లేవు. సరిగ్గా ఈ బలహీనతనే పాక్ తీవ్రవాదులు ఆసరగా చేసుకుని సైనికులపై చైనా స్టీల్‌తో రూపొందిన బుల్లెట్లతో దాడులు జరుపుతుండటం బాధాకరం.
పాక్ దుశ్చర్యలకు చైనా సహకారం అందిస్తోంది అనడానికి ఇదేమీ మొదటి సాక్ష్యం కాదు.. గత నెలలో పాకిస్థాన్‌కి చైనా 2,496 రాకెట్ లాంచర్లు ( నేలపై నుంచి ప్రయోగించేవి) సరఫరా చేసింది. పాక్ ఆర్మీతోపాటు ఐఎస్ఐ కార్యకలాపాల కోసమే ఈ రాకెట్ లాంచర్లని చైనా నుంచి తెప్పించుకున్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయి.