తమిళ రాజకీయాలు: పళని, పన్నీర్ ఒక్కటయ్యారు
తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. జయ మరణం అనంతరం విభేదాలు ఏర్పడి రెండు వర్గాలుగా విడిపోయిన పళని, పన్నీర్ సెల్వం మధ్య ఎట్టకేలకు రాజీకుదిరింది. దీంతో అన్నాడీఎంకే పునరేకీకరణకు మార్గం సుగమమైంది. పన్నీర్ సెల్వం వర్గం ఉంచిన ప్రధాన డిమాండ్లను పళని వర్గం అంగీకరించడంతో ఈ మేరకు రాజీ కుందిరింది.
రాజీ ఒప్పందంలో భాగంగా పన్నీర్ సెల్వంకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు సీఎం పళని అంగీకరించారు. అలాగే శశికళ కుటుంబాన్ని పార్టీ నుంచి దూరం పెట్టేందుకు పళని వర్గం సమ్మతించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలతో విస్తృతంగా చర్చించిన తర్వాతే సీఎం పళని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి జయకుమార్ ప్రకటించారు. భవిష్యత్తులో పార్టీ నడిపించేందుకు కమిటీ వేస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి జయకుమార్ వెల్లడించారు.
పళని, పన్నీర్ వర్గం మధ్య వైరంతో అన్నాడీఎంకే పార్టీలో సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. పాలన పరంగాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. దీన్ని అవకాశంగా తీసుకొని ప్రతిపక్ష పార్టీ డీఎంకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. దీన్ని పసిగట్టిన ఇరువురు నేతలు పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాజీకి రావాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ మేరకు రాజీ చేసుకున్నట్లు ఇరువర్గాలు ప్రకటించాయి.