పశ్చిమ బెంగాల్ పంచాయితీ ఎన్నికలు హింసాత్మకం
పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలు భారీ భద్రత నడుమ సోమవారం ప్రారంభమయ్యాయి.
పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలు భారీ భద్రత నడుమ సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగనుంది. ఓట్ల లెక్కింపు ఈనెల 17న జరగనుంది. ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ బెంగాల్‌లోని 621 జిల్లా పరిషత్‌లు, 6,157 పంచాయతీ సమితులు, 31,827 గ్రామ పంచాయతీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ సందర్భంగా సుమారు 1,500 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు చేపట్టారు.
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలలో హింస చెలరేగింది. ఈ ఉదయం పోలింగ్ ప్రారంభమైన వెంటనే నాలుగు జిల్లాలలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఉత్తర 24 పరగణాల జిల్లాలలో బర్ద్వాన్, కుచ్ బెహర్, దక్షిణ 24 పరగణాల జిల్లాలలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగడంతో హింసాత్మక ఘటనలు జరిగాయి. అటు ఓ పోలింగ్ కేంద్రంలో చొరబడ్డ కొందరు బ్యాలెట్ పత్రాలపై స్టాంపులు వేసేందుకు యత్నించారు. మరోచోట బాంబు దాడిలో 20 మంది గాయపడ్డారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలో సీపీఎం మద్దతుదారు ఇళ్లను ప్రత్యర్థులు గతరాత్రి తగులబెట్టగా ఇద్దరు వ్యక్తులు చనిపోయారు.