న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష అమలు చేస్తారని దేశమంతా ఎదురు చూస్తోంది. మొన్నటికి మొన్న డిసెంబర్ 16నే దోషులను ఉరి తీస్తారంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. ఐతే దోషుల్లో అక్షయ్ సింగ్ రివ్యూ పిటిషన్ వేయడంతో దీనికి కొద్దిరోజులు బ్రేక్ పడినట్లయింది. అక్షయ్ సింగ్ వేసిన రివ్యూ పిటిషన్ ఢిల్లీ కోర్టులో ఈ రోజు విచారణకు వచ్చింది. దీన్ని విచారించిన న్యాయస్థానం గతంలో ఇచ్చిన తీర్పుపై రివ్యూ చేసేందుకు ఎలాంటి ఆధారాలు లేవంటూ పిటిషన్ కొట్టివేసింది. దోషికి గతంలో ఖరారు చేసిన మరణ శిక్ష అలాగే ఉంటుందని పేర్కొంది. ఐతే దోషి కోరుకున్న విధంగా నిర్ణీత కాలంలో క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునేందుకు అవకాశం కల్పించింది. ఇందుకోసం తీహార్ జైలు అధికారులకు తాజాగా కొత్త ఉత్తర్వులతో నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా వారు( దోషులు) క్షమాభిక్ష పెట్టుకునేందుకు అవకాశం కల్పించాలని పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణను జనవరి 7కు వాయిదా వేసింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : Nirbhaya case latest updates | నిర్భయకు అశ్రు నివాళి.. నేటికి సరిగ్గా ఏడేళ్లు పూర్తి.. దోషులకు అమలు కాని ఉరి శిక్ష


కోర్టుహాలులోనే కుప్పకూలిన నిర్భయ తల్లి
మరోవైపు నిర్భయ కేసులో దోషులకు డెత్ వారెంట్ ఇవ్వాలంటూ ఆమె తల్లిదండ్రులు పెట్టుకున్న పిటిషన్‌ను పటియాలా హౌజ్ కోర్టు విచారించింది. పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం... తల్లిదండ్రుల వాదనలు నిశితంగా విన్న తర్వాత... తమకు వారి పట్ల పూర్తి సానుభూతి ఉందని తెలిపింది. కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఎంత బాధ ఉంటుందో తమకు తెలుసునని న్యాయమూర్తి అన్నారు. కానీ దోషులకు కూడా హక్కులు ఉంటాయని గుర్తు చేశారు. న్యాయస్థానం వారి వాదనలు కూడా వినాల్సి ఉంటుందని తెలిపారు. న్యాయమూర్తి వ్యాఖ్యలు విన్న తర్వాత నిర్భయ తల్లి కోర్టు హాలులోనే కుప్పకూలిపోయారు.


Read also : ఏడేళ్లుగా పోరాడుతున్నాం.. ఏడు రోజులు ఆగలేమా ?


ధర్మాసనం మా గోడు పట్టించుకోవడం లేదు : నిర్భయ తల్లి
కోర్టులో జరిగిన పరిణామాలపై నిర్భయ తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానం తమ గోడును పట్టించుకోవడం లేదని అన్నారు. దోషుల హక్కుల గురించి మాత్రమే ధర్మాసనం ఆలోచిస్తోందని.. తమ హక్కుల గురించి పట్టించుకోవడం లేదన్నారు. మరో వాయిదా తర్వాత  అయినా వారికి శిక్ష అమలు చేస్తారనే గ్యారెంటీ లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దోషులకు మరో అవకాశం కల్పించడంపై నిర్భయ తండ్రి  కూడా అసహనం వ్యక్తం చేశారు. వారికి డెత్ వారెంట్ ఇచ్చే వరకు తమకు న్యాయం జరిగినట్లు కాదని అన్నారు.