కేంద్ర ప్రభుత్వంపై  పీడీపీ చీఫ్ , కశ్మీర్  మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాజా పరిణామాలపై ఆమె స్పందిస్తూ.. బీజేపీ కుఠిల రాజకీయాలు మానుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. తమ  పార్టీని చీల్చేందుకు బీజేపీ కుట్రపన్నుతోందని ఆరోపించారు. తమ పార్టీ అంతర్గత వ్యవహారాల్లోక తలదూర్చి విభేదాలు సృష్టించేందుకు కుట్రపన్నిందని విమర్శించారు. పీడీపీని చీల్చే ప్రయత్నాలు మానుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ఆమె  వార్నింగ్ ఇచ్చారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1987లో కశ్మీర్‌లో ఉగ్రవాదం ఎలా పెరిగిపోయిందో మరిచిపోవద్దన్న మహబూబా.. కేంద్రం చర్యలతో నాటి భయంకర పరిస్థితి కశ్మీర్ లోయలో పునరావృతం కావచ్చన్నారు. 1987 తరహాలో ప్రజల ఓటింగ్ హక్కులను కేంద్రం ప్రభుత్వం  కాలరాసిందన్నారు. అదే తరహాలో ఇప్పుడు కూడా విభజన రాజకీయాలు, జోక్యం పెరిగితే సలావుద్దీన్, యాసిన్ మాలిక్ వంటి వాళ్లు మళ్లీ పుట్టి ఉద్యమించే అవకాశాలు ఉంటాయన్నారు. బీజేపీ ఇదే తరహా రాజకీయాలు చేస్తే లోయలో తలెత్తే  దుష్పరిణామాలకు మోడీ సర్కార్ బాధ్యత వహించాల్సి ఉంటుందని మహబూబా ముఫ్తీ హెచ్చరించారు.



 


పీడీపీతో మూడేళ్ల పాటు అధికారం పంచుకున్న బీజేపీ ఇటీవలె ఆ పార్టీతో తెగతెంపులు చేసుకుంది. దీంతో మెహబూబా ముఫ్తీ తన పదవికి రాజీనామా చేయాల్సింది. అనంతరం కశ్మీర్‌ అసెంబ్లీని సుప్త చేతనావస్థలో ఉంచిన మోడీ సర్కార్ ..అక్కడ గవర్నర్ పాలనను అమల్లోకి తెచ్చింది. మరోవైపు పీడీపీలోని అసమ్మతి ఎమ్మెల్యేలను కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామంపై ఆగ్రహించిన మహబూబా ముఫ్తీ  మోడీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో  విరుచుకుపడ్డారు.