కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని సెరంపూర్‌లో ఓ ఎన్నికల ర్యాలీలో పాల్గొనడానికి వెళ్లిన ప్రధాని మోదీ అక్కడ దీదీ మమతా బెనర్జిని ఉద్దేశించి ప్రసంగిస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి మీరు అధికారంలోకి రావడం అంత ఈజీ కాదని దీదీకి ప్రధాని మోదీ హెచ్చరికలు జారీచేశారు. మీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకే చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తనతో నిరంతరంగా సంప్రదింపులు జరుపుతున్నారని, మే 23న ఫలితాలు వెలువడిన అనంతరం మీతో ఎవ్వరూ ఉండరని, ఆ తర్వాత ఇక మీరు ఒంటరిగా మిగలాల్సిందేనని ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీపై మీ నేతలకు నమ్మకం పోయిందని, అందుకే బీజేపితో కలిసి రావడానికి సిద్ధమయ్యారని మోదీ వ్యాఖ్యానించారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో వున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉందనే సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీపై ఎన్నోసార్లు ఘాటైన వ్యాఖ్యలు చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసి అధినేత్రి మమతా బెనర్జి సైతం ఎన్నికల ప్రచార సభల్లోనూ మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ వస్తున్న నేపథ్యంలో నేడు ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనియాంశమయ్యాయి.