కన్యాకుమారి: ముంబై 26/11 దాడుల అనంతరమే భారత సైన్యం లక్షిత దాడులకు సిద్ధమైనప్పటికీ.. అప్పటి యూపీఏ ప్రభుత్వం వారికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని ప్రధాని నరేంద్ర మోది అన్నారు. ఒకవైపు వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్‌ వర్ధమాన్‌ను చూసి భారతీయులంతా గర్వపడుతుండగా ప్రతిపక్షాలు మాత్రం భద్రతా బలగాల్ని అనుమానించేలా వ్యవహరిస్తూ పరోక్షంగా పాకిస్థాన్‌కు సహాయం చేస్తున్నాయని విపక్షాలపై మోదీ మండిపడ్డారు. మోదీని విమర్శించాలనే లక్ష్యంతో ప్రతిపక్షాలు చేస్తోన్న వ్యాఖ్యలు దేశానికి హాని కలిగిస్తున్నాయి. చివరకు మన దేశంలో ప్రతిపక్ష నేతలు చేస్తోన్న వ్యాఖ్యలను పాకిస్తాన్ పార్లమెంట్‌లో అక్కడి నేతలు ఆనందంగా చెప్పుకుంటున్నారు. పాక్ రేడియోలోనూ భారత ప్రతిపక్ష నేతల వ్యాఖ్యల్ని ఉపయోగించుకుంటున్నారు అంటూ మోదీ మండిపడ్డారు. తమిళనాడులోని కన్యాకుమారిలో శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించే క్రమంలో మోదీ ఈ ఆరోపణలు చేశారు. భారత సైన్యానికి మద్దతిస్తారా? లేదంటే ఉగ్రవాదులకు మద్దతిచ్చే అరాచకశక్తులకు అండగా నిలుస్తారా అనేది ప్రతిపక్షాలు తేల్చుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. మోదీ ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. కానీ, మనకు దేశమే ముఖ్యం. మీ రాజకీయ ప్రయోజనాల కోసం భారత్‌ను బలహీనపర్చి శత్రువులకు సహకరించొద్దంటూ ప్రతిపక్షాలకు హితవు పలికారు.


భారత్‌లో దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్ ఉగ్రవాదులకు భారత ప్రభుత్వం వడ్డీతో సహా బదులు చెల్లించి ప్రతీకారం తీర్చుకుంటామని మోదీ పాక్ ఉగ్రవాదులనుహెచ్చరించారు. భారత్‌లో పాక్ ఉగ్రవాదులు బీభత్సం సృష్టిస్తుంటే భారత్ ఇకపై నిస్సహాయంగా చూస్తూ ఉండబోదని తేల్చిచెప్పారు. దేశ తొలి మహిళా రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, వాయుసేన వింగ్ కమాండర్ పైలట్ అభినందన్ వర్థమాన్ ఇద్దరూ తమిళనాడుకు చెందినవారు కావడం గర్వకారణంగా ఉందన్నారు.