ఉన్నావ్, కథువ అత్యాచార ఘటనలపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్, కథువ అత్యాచార ఘటనలపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్, కథువ అత్యాచార ఘటనలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ తరహా దుశ్చర్యలు సిగ్గు చేటు అని ఉన్నావ్, కథువ ఘటనలను ప్రధాని తీవ్రంగా ఖండించారు. "బాధితులకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. మహిళలపై నేరాలకు పాల్పడేవారు ఎవరైనా వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సమాజంలో చోటుచేసుకుంటున్న ఈ దుశ్చర్యలను అంతమొందించేందుకు మనమందరం కలిసి కృషి చేయాల్సిన అవసరం వుంది" అని ప్రధాని అభిప్రాయపడ్డారు. దేశంలో ఇలాంటి నేరాలు ఎక్కడ జరిగినా.. అవి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తంచేశారు. ఢిల్లీలోని 26, అలీపూర్ రోడ్‌లో డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ నేషనల్ మెమోరియల్‌ను జాతికి అంకితం చేసిన అనంతరం జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతకన్నా ముందుగా డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ నేషనల్ మెమోరియల్ గురించి మోదీ మాట్లాడుతూ... దశాబ్ధాల క్రితం జరగాల్సి వున్న ఈ తరహా మంచి పనులు అన్నీ ఇప్పుడు తమ ప్రభుత్వం హయాంలో జరుగుతున్నాయని అన్నారు. తమకన్నా ముందు అధికారంలో వున్న కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ నేషనల్ మెమోరియల్ ప్రాజెక్టు ఫైళ్లని మూసేసి తొక్కిపెట్టగా.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఫైళ్లని తవ్వి తీసి, ప్రాజెక్టుని పూర్తి చేశామని అన్నారు. కాంగ్రెస్ రాజవంశంతో అంబేద్కర్ పోరాడారు కనుకే ఆయన ఫోటోలను కూడా పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఇష్టపడలేదు అని మోదీ పేర్కొన్నారు.
ఇదిలావుంటే, దేశంలో చర్చనియాంశమైన లైంగిక నేరాలపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటివరకు స్పందించకుండా మౌనం వహించడం ఏంటంటూ ఇవాళ మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ప్రధానిపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇకనైనా ప్రధాని మోదీ ఈ దుర్ఘటనలపై నోరు విప్పాలని ఈ సందర్భంగా మోదీని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ డిమాండ్ చేసిన కొన్ని గంటల అనంతరం డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ నేషనల్ మెమోరియల్ ప్రారంభోత్సవం వేదికగా ఉన్నావ్, కథువ ఘటనలపై మోదీ స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.