న్యూఢిల్లీ: రానున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇవే చివరి పార్లమెంట్ సమావేశాలు కావడంతో నేడు జరిగిన చివరి లోక్ సభ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేరును ప్రస్తావించకుండానే ప్రధాని నరేంద్ర మోదీ ఆయనపై వ్యంగ్యస్త్రాలతో విరుచుకుపడ్డారు. ఓవైపు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత, లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గేపై ప్ర‌శంస‌లు కురిపిస్తూనే మరోవైపు రాహుల్‌పై తనదైన స్టైల్లో విమర్శలు గుప్పించారు. బ‌డ్జెట్ ముగింపు సంద‌ర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ గత నాలుగున్నరేళ్లకుపై కాలంలో తమ సర్కార్ హయాంలో జ‌రిగిన అభివృద్ధి పనులను, దేశ పురోగతి గురించి పలు అంశాలను గుర్తుచేసుకున్నారు. ప్ర‌తిప‌క్ష నేత మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే స‌భ‌కు హాజ‌రైన తీరును ప్రశంసిస్తూ... అద్వానీ గారు ఎలాగైతే స‌భ‌కు పూర్తి స‌మ‌యాన్ని కేటాయించేవారో అదే త‌ర‌హాలో ఖ‌ర్గే కూడా స‌భ‌కే అంకితం అయ్యార‌న్నారు. ఈ విషయంలో పార్లమెంట్ సభ్యులు ఖర్గేను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. గత 50 ఏళ్లకుపైగా ప్ర‌జాప్ర‌తినిధిగా ప్రజా జీవితంలో వుంటున్నా.. ఇప్పటికీ స‌భ ప‌ట్ల ఆయ‌న చూపిస్తున్న గౌర‌వాన్ని అభినందించకుండా ఉండలేకపోతున్నానని తెలిపారు. 


ఇదిలావుంటే, రాహుల్ గాంధీ గురించి మోదీ పరోక్షంగా మాట్లాడుతూ.. మొదటిసారి సభకు వచ్చిన తనకు కౌగిలించుకోవడం గురించి, సభలో కన్ను కొట్టడం గురించి ఇక్కడే చూశానని అన్నారు. మీడియాలో సైతం ఆ ఘటనను ఓ పండగలా చూపించారని చెబుతూ రాహుల్ గాంధీపై మోదీ తనదైన స్టైల్లో సెటైర్లేశారు.