న్యూఢిల్లీ: 1947లో దేశ విభజన సమయంలో అప్పటి కాంగ్రెస్ నేతలకు ముందుచూపు లోపించడం వల్లే భౌగోళికంగా మన దేశంలో ఉండాల్సిన కర్తార్‌పూర్ పుణ్యక్షేత్రం పాకిస్తాన్‌లో కలిసింది అని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కర్తార్‌పూర్ పాకిస్తాన్‌లో కలిసిపోయినా పట్టించుకోని కాంగ్రెస్ నేతలు కనీసం ఈ 70 ఏళ్ల కాలంలో మన సిక్కులు కర్తార్‌పూర్ సాహిబ్ దర్శనకు వెళ్లే భాగ్యం కూడా కల్పించలేకపోయారు ఎందుకు అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. సిక్కు మతస్తుల ఆరాధ్య దైవమైన కర్తార్‌పూర్ సాహిబ్‌ను దర్శించుకునేందుకు వీలు కల్పిస్తూ ఇటీవలే కర్తార్‌పూర్ కారిడార్ శంకుస్థాపనకు ముందడుగు పడిందంటే.. అది కేవలం మోదీ వల్లే సాధ్యపడలేదని, అది మీరు వేసిన ఓట్ల వల్లే సాధ్యమైందని మోదీ అభిప్రాయపడ్డారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాజస్తాన్‌లోని హనుమాన్‌ఘడ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొని ప్రసంగిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. 


హనుమాన్‌ఘడ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టిన నరేంద్ర మోదీ.. ఇన్నేళ్ల కాలంలో కాంగ్రెస్ నేతలు చేసిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగిపోవడమే తన లక్ష్యమని తెలిపారు.