న్యూఢిల్లీ: త్వరలోనే లోక్ సభ ఎన్నికలకు నగారా మోగనున్న నేపథ్యంలో ఇవాళ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ చివరిసారిగా సమావేశం కానుంది. లోక్ కల్యాణ్ మార్గ్ లోని ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసంలో ఈ కేబినెట్ భేటీ జరగనుంది. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల రోస్టర్ విధానంలో పాత పద్ధతి పునరుద్ధరణకు సంబంధించిన అంశంపై ఇవాళ ఓ ఆర్డినెన్స్ తీసుకువచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి ఉన్నతా విద్యాసంస్థల్లో విద్యను అందించేందుకు ప్రవేశపెట్టిన 10% కోటాను అమలు చేసేందుకు రూ.4000 కోట్లు అదనంగా కేటాయించే ఫైలుపై సైతం నేడు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్టు సమాచారం. అయితే, అదే సమయంలో ఈ 10% కోటా కారణంగా ఎస్సీ/ఎస్టీ విద్యార్థుల కోటాపై ఎలాంటి ప్రభావం పడకుండా వుండేందుకు అదనంగా మరో 25% సీట్లు కొత్తగా పెంచనున్నట్టు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. 


ఇదిలావుంటే, గడిచిన ఐదేళ్లలో భారతీయ రైల్వే సాధించిన పురోగతిపై సమీక్ష నిర్వహించడంతోపాటు భవిష్యత్ కార్యాచరణకు ఓ రోడ్ మ్యాప్ రూపొందించాలనే ఉద్దేశంతో రైల్వే శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పీయుష్ గోయల్ ఓ సమావేశం నిర్వహించనున్నారు.