ఎలా డీల్ చేయాలో పోలీసులకు బాగా తెలుసు: కేరళ సీఎం పినరయి విజయన్
Keralaలోని కొన్ని అతివాద గ్రూపులు, ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తూ సీఏఏపై నిరసన అని సాకులు చెబుతున్నారంటూ సీఎం పినరయి విజయన్ మండిపడ్డారు.
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షాలకు, అతివాద గ్రూపులకు వార్నింగ్ ఇచ్చారు. గొడవలు చేసి వాటిని రాష్ట్ర సమస్యపై పోరాటం, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఆందోళనగా చిత్రీకరిస్తే సహించేది లేదని, పోలీసులు అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని పినరయి విజయన్ స్పష్టం చేశారు. ఎస్‌డీపీఐ (SDPI) లాంటి అతివాద గ్రూపులు, ప్రతిపక్షాలకు చెందిన నేతలు రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులకు కారకులవుతున్నారని సీఎం ఆరోపించారు.
ప్రతి సమస్యను పౌరసత్వ సవరణ చట్టం (CAA)ను వ్యతిరేకిస్తూ చేసిన నిరసన, ఆందోళనగా చిత్రీకరించాలని ఆ పార్టీల నేతలు, గ్రూపులు యత్నిస్తున్నాయని విమర్శించారు. కేరళ ప్రభుత్వం ఇలాంటి వాటిని చూస్తూ ఊరుకోదన్నారు. గొడవలు, ఆందోళనలు చేపట్టి మతపరమైన వివాదాలు తలెత్తితే మాత్రం కేరళ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని శాసనసభ వేదికగా హెచ్చరించారు.
మతపరమైన గొడవలు లేవనెత్తేవారిని ఎలా డీల్ చేయాలో పోలీసులకు తెలుసునంటూ చురకలంటించారు. అయితే సీఎం విజయన్ మాటలను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి. ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని, తమలాంటి వారిపై కాదని అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. దీంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది.