న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఇవాళ కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కరం భారతరత్న అవార్డుతో సత్కరించింది. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రణబ్ ముఖర్జీకి భారత రత్న అవార్డు ప్రదానం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో వివిధ హోదాల్లో దశాబ్దాల తరబడి దేశానికి సేవలు అందించినందుకుగాను ప్రణబ్ ముఖర్జీకి భారత రత్న అవార్డుతో సత్కరించనున్నట్టు ఈ ఏడాది జనవరిలో చేసిన ప్రకటన మేరకే భారత సర్కార్ తాజాగా ఆయనకు పురస్కారం ప్రధానం చేసింది. 2012 నుంచి 2017 వరకు భారత దేశ 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ సేవలు అందించారు. అంతకన్నా ముందుగా ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవి నరసింహా రావు, మన్మోహన్ సింగ్ హయాంలలో కేంద్రంలో ఆయన కీలక పదవుల్లో పనిచేసి దేశానికి సేవలు అందించారు.


ప్రముఖ అస్సామీ గాయకుడు, కవి, గేయ రచయిత, సినీ దర్శకుడు అయిన భూపేన్ హజారికా, సామాజిక వేత్తగా పేరొందిన సీనియర్ ఆర్ఎస్ఎస్ నాయకుడు నానాజీ దేశ్‌ముఖ్‌లకు కూడా వారి మరణానంతరం భారతరత్న ప్రకటించారు. భూపేన్ హజారికా తరపున ఆయన కుమారుడు తేజ్ హజారికా, నానాజీ దేశ్‌ముఖ్ తరపున దీన్ దయాళ్ రీసెర్చ్ ఇన్‌‌స్టిట్యూట్ చైర్మన్ వీరేంద్రజీత్ సింగ్ భారత రత్న అవార్డులను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.