తండ్రి నిర్ణయంతో విభేదించిన ప్రణబ్ కుమార్తె
గురువారం నాగ్‌పూర్‌లో జరుగుతున్న ఆరెస్సెస్ 3వ వార్షిక శిక్షణ కార్యక్రమానికి భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సమావేశానికి పిలిచి ఆరెస్సెస్, బీజేపీ నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఆయన కూతురు, ఢిల్లీ మహిళా కాంగ్రెస్ చీఫ్ శర్మిష్ట ముఖర్జీ ఆరోపించారు.
గురువారం నాగ్‌పూర్‌లో జరుగుతున్న ఆరెస్సెస్ 3వ వార్షిక శిక్షణ కార్యక్రమానికి భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సమావేశానికి పిలిచి ఆరెస్సెస్, బీజేపీ నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఆయన కూతురు, ఢిల్లీ మహిళా కాంగ్రెస్ చీఫ్ శర్మిష్ట ముఖర్జీ ఆరోపించారు. తప్పుడు కథలు, కథనాలు చెప్పుకోవడం, ప్రజల్లో కొత్త అనుమానాలు రేకెత్తించడం రెండు సంస్థల లక్ష్యమన్నారు. ప్రణబ్ ఏం మాట్లాడారనేది ఆరెస్సెస్‌కు కూడా గుర్తుండదని.. కానీ ఆయన రాకకు సంబంధించిన వీడియోను ఎప్పటికీ చూపిస్తుందన్నారు.
‘మీ ప్రసంగంలో ఆరెస్సెస్ సిద్ధాంతాలకు మద్దతు పలుకుతారని వాళ్లకు కూడా నమ్మకం లేదు. మీ మాటల్ని మరిచిపోయినా ఆ దృశ్యాలకు బూటకపు వ్యాఖ్యలు జోడించి ప్రచారం చేస్తారు’ అని అన్నారు.
నాగపూర్‌కు వెళ్లడం ద్వారా తన తండ్రి (ప్రణబ్ ముఖర్జీ) బీజేపీ నేతలకు కట్టుకథలు అల్లే అవకాశమిస్తున్నారని అన్నారు. బీజేపీ నీచ రాజకీయాలను ఆయన అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ప్రణబ్ ఆరెస్సెస్ కార్యక్రమంలో ప్రసంగించడానికి ఒకరోజు ముందు.. శర్మిష్ట బీజేపీలో చేరుతున్నట్లు ఊహాగానాలు రాగా.. ఆమె వాటిని కొట్టిపారేశారు. కాంగ్రెస్‌ను వీడాల్సి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు.