భారత రాజ్యాంగం నుండి లౌకిక, సామ్యవాద పదాలను తొలగించి, హిందూ పదాన్ని చేర్చి హిందూ రిపబ్లిక్ దేశంగా భారతదేశాన్ని ప్రకటించాలని విహెచ్ పి అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో జరిగిన సమావేశంలో ఆయన పైవిధంగా స్పందించారు. 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "దేశంలో రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు, జవాన్లు, కలెక్టర్లు.. ఇలా అందరూ హిందువులే ఉండాలి. దేశం అన్నింటా  హిందువులే ప్రతిబింబించాలి. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలుంటే వారికి సంక్షేమ పథకాలు నిలిపివేసేలా కేంద్రం కఠిన చట్టం తీసుకురావాలి. దేశంలో జనాభా అదుపులో ఉంటే ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అవకాశాలు లభిస్తాయి. హిందూ మతం అధికారంలో ఉంటే దేశం మరింతగా అభివృద్ధి చెందుతుంది, దేశరక్షణ పటిష్టంగా ఉంటుంది. హిందూ మతం ఏ మతానికి శత్రువు కాదు.. అలా అని తమ మతాన్ని కించపరిస్తే ఊరుకొనేది లేదు" అని తొగాడియా చెప్పారు.