2019 ఎన్నికల్లో ప్రజల సమస్యలను పరిష్కరించడానికి తాను ఎంత గొప్ప వ్యక్తి మీదనైనా సరే పోటీకి నిలవడానికి సిద్ధమని విశ్వ హిందూ పరిషత్ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా తెలిపారు. తొగాడియా ఇటీవలే వీహెచ్‌పీ నుండి వైదొలిగి తానే స్వయంగా ఓ సంస్థను స్థాపించుకున్నారు. "అంతరాష్ట్రీయ హిందూ పరిషత్" పేరుతో ఓ సంస్థను ప్రారంభించి హిందువుల ఐక్యత కోసం పోరాడే అసలైన సంస్థ తమదేనని తెలిపారు. బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడిన తొగాడియా తనకు మోదీ సర్కార్ పై పలు అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణ విషయంలోగానీ.. భారతదేశంలోకి అక్రమంగా చొచ్చుకొస్తున్న బంగ్లాదేశీయుల విషయంలో గానీ... యూనిఫార్మ్ సివిల్ కోడ్ విషయంలో గానీ బీజేపీ సర్కార్ అవలంబిస్తున్న తీరు తనకు నచ్చడం లేదని తొగాడియా అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"త్వరలోనే భారతదేశ రాజకీయాల్లో ప్రజలు ప్రత్యమ్నాయ నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది" అని కూడా తొగాడియా అన్నారు. ఒకవేళ తొగాడియా 2019 ఎన్నికలలో మోదీకి వ్యతిరేకంగా నిలబడే అవకాశం ఉందా ? అన్న ప్రశ్నకు కూడా ఆయన జవాబిచ్చారు. హిందువుల ఐక్యత కోసం, నిరుద్యోగ సమస్యలు దూరం చేయడం కోసం, రైతుల అభ్యున్నతి కోసం తాను ఎంత గొప్ప వ్యక్తి మీదనైనా పోటీకి నిలబడడానికి సిద్ధమేనని తొగాడియా అన్నారు. 


ఆగస్టు 13వ తేది నుండి అంతరాష్ట్రీయ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో తాను లక్నో నుండి ఢిల్లీ వరకూ సాధువులతో కలిసి పాద యాత్ర చేయనున్నట్లు.. రామ మందిరం ఎప్పుడు కడతారో ఆ తేదిని ప్రకటించాలని కోర్టును డిమాండ్ చేయనున్నట్లు ప్రవీణ్ తొగాడియా తెలిపారు. భారతదేశంలో 14 శాతం ఉన్న ముస్లిములను మైనారిటీలుగా ఎలా పేర్కొంటారని తొగాడియా ప్రశ్నించారు. ఇలాంటి విషయాలలో బీజేపీ వైఖరి తనకు నచ్చడం లేదని.. అందుకే తాను తనదైన మార్గంలో పోరాడాలని నిర్ణయించుకున్నానని తొగాడియా అన్నారు.