జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో బుధవారం నుండి గవర్నర్ పాలనకు ఆదేశిస్తూ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ప్రకటన జారీ చేశారు. ఆ రాష్ట్రంలో బీజేపీ-పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీల మధ్య ఉన్న పొత్తు తెగిపోవడంతో రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మంగళవారం సాయంత్రం బీజేపీ జనరల్ సెక్రటరీ రామ్ మాధవ్ మాట్లాడుతూ తమ పార్టీ, పీడీపీతో పొత్తును ఉపసంహరించుకుంటున్నట్లు తెలపడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ తర్వాత ముఖ్యమంత్రి ముఫ్తీతో పాటు మంత్రులు తమ రాజీనామా పత్రాలను గవర్నర్ ఎన్ ఎన్ వోహ్రాకు అందించడంతో రాష్ట్రంలో అనిశ్చితి నెలకొంది. గవర్నర్ ఈ విషయమై ఒక రిపోర్టు తయారుచేసి వెనువెంటనే రాష్ట్రపతికి పంపగా.. ఆయన జమ్ము కాశ్మీరు రాజ్యాంగంలోని సెక్షన్ 92 ప్రకారం ప్రభుత్వం ఏ మాత్రం పాలన సాగించే అవకాశం లేకపోవడంతో గవర్నర్ పాలన విధిస్తున్నట్లు తెలిపారు.


ఈ గవర్నర్ పాలన దాదాపు ఆరు నెలలు కొనసాగే అవకాశం ఉంది. రంజాన్ పండగ తర్వాత భారత ప్రభుత్వం కాశ్మీరు భూభాగంలో తీవ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు మిలిట్రీని పటిష్టం చేయాలని భావిస్తున్న క్రమంలో.. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీతో తలెత్తిన వివాదాలే ఇరు ప్రభుత్వాల మధ్య బంధం తెగిపోవడానికి కారణమైనట్లు వార్తలు వస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షాని సంప్రదించాకే పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ కార్యదర్శి రామ్ మాధవ్ మీడియాకి తెలిపారు.


రోజు రోజుకీ కాశ్మీరులో తీవ్రవాద కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని.. పౌరుల హక్కులు ప్రమాదంలో పడ్డాయని.. సుజాత్ బుఖారీ హత్యే అందుకు ఉదాహరణ అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. వారం రోజుల క్రితం ప్రముఖ జర్నలిస్టు సుజాత్ బుఖారీని శ్రీనగర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అదే రోజు ఆర్మీ జవాన్ ఔరంగజేబును కూడా ఉగ్రవాదులు హత్య చేశారు.


ఈ క్రమంలో కాశ్మీరు ప్రాంతంలో నెలకొంటున్న ఉద్రిక్త పరిస్థితుల పట్ల ఇరు పార్టీల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడం వల్లే పీడీపీ, బీజేపీతో తెగదెంపులు చేసుకుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో జమ్ము కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ, ఆ రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అప్పటి వరకు గవర్నర్ పాలన సముచితమేనని అన్నారు.