రైలు ప్రయాణం చేసేవారు ఇక టీ, కాఫీలు తాగాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడేలా ఉంది. ఎందుకంటే రైల్వే శాఖ ఆ ధరలను పెంచడానికి మార్గం సుగమం చేసింది. ఈ మేరకు సర్క్యులర్స్ కూడా పంపించడానికి ప్రయత్నిస్తోంది. కొత్త రేట్ల ప్రకారం 150 మిలీ ఛాయ్ కప్పు గతంలో రూ.7 ఉండగా.. ఇప్పుడు కనీసధరను రూ.10 చేయనున్నట్లు ఐఆర్‌సీటీసీ తెలిపింది. అలాగే కాఫీ ధరను కూడా రూ.10 లకు తగ్గకుండా ధరను పరిమితం చేస్తున్నామని ఐఆర్‌సీటీసీ  తెలిపింది. అయితే రెడీమేడ్ స్టాండర్డ్ టీ మాత్రం రూ.5 లకే ఇస్తామని.. సాధారణ టీ విషయంలో ధర పెరగదని ఐఆర్‌సీటీసీ అధికారులు అంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లైసెన్సు ఫీజు మార్పులు సంభవిస్తున్న కారణంగా ధరలు కూడా పెంచాల్సి వస్తుందని ఐఆర్‌సీటీసీ తెలపడం గమనార్హం. జీఎస్టీతో కలిసి టీ, కాఫీలు అందిస్తున్నందున రేట్లు ఇలా పెరిగాయని అంటున్నారు. ఈ మధ్యకాలంలో రైలులో దొరికే ఆహార పదార్థాల ధరల పట్టికను "మెనూ ఆన్ రైల్" పేరుతో రైలులో డిస్ప్లే చేయాలని రైల్వే శాఖ ప్రకటించింది. ప్రయాణికులు కూడా ఆ ధరల పట్టికలో ఉన్న రేట్లను తప్పించి.. క్యాటరింగ్ వ్యక్తులకు అదనంగా ఇంకేమీ చెల్లించాల్సిన అవసరం లేదని కూడా తెలిపింది. 


అలాగే ప్రయాణికులు "మెనూ ఆన్ రైల్" యాప్ ఫోన్‌లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆ యాప్‌లో రైళ్ల పేర్ల వారీగా ధరలు పట్టికలు ఉంటాయి. అందులో చూపించిన ధరల కంటే ఎక్కువ క్యాటరింగ్ వ్యక్తులకు చెల్లించాల్సిన అవసరం లేదు. టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, బ్రేక్ ఫాస్ట్, మీల్స్‌కు ఈ ధరల పట్టిక వర్తి్స్తుంది. ఐఆర్‌సీటీసీ ప్రస్తుతం 350 ట్రైన్లలో తన సేవలను అందిచడం గమనార్హం. అయితే రాజధాని, శతాబ్ది రైళ్లలో మాత్రం ఈ మార్పులు వర్తించవని ఐఆర్‌సీటీసీ అధికారులు అంటున్నారు.