ప్రియాంకా గాంధీ అక్రమ అరెస్ట్ బాధాకరం: రాహుల్ గాంధీ ఆగ్రహం
ప్రియాంకా గాంధీ అక్రమ అరెస్ట్ బాధాకరం: రాహుల్ గాంధీ ఆగ్రహం
లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లోని సోంభద్ర జిల్లా ఉంభ గ్రామానికి చెందిన ఆదివాసీలు సాగు చేసుకుంటున్న 36 ఎకరాల భూమిని యగ్యాదత్ అనే స్థానికుడు స్వాధీనం చేసుకునే క్రమంలో వారిపై కాల్పులు జరిపి 10 మంది మృతికి కారణమైన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ఈరోజు ఉదయం వారణాసికి వచ్చి అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా సోంభద్రకు బయల్దేరిన ప్రియాంకా గాంధీని మార్గం మధ్యలోనే మీర్జాపూర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడే రోడ్డుపై బైఠాయించిన ప్రియాంకా గాంధీ.. తాను సోంభద్రకు ఎందుకు వెళ్లకూడదో చెప్పాల్సిందిగా అధికారులను డిమాండ్ చేశారు. ఏ హక్కుతో, ఎవరి ఆదేశాలతో తనను అడ్డుకుంటున్నారో అందుకు సంబంధించిన ఆదేశాలను చూపించాల్సిందిగా పట్టుబట్టారు. దీంతో ప్రియాంకా గాంధీని ఓ ప్రభుత్వ వాహనంలో అక్కడి నుంచి తీసుకెళ్లారు.
ప్రియాంకా గాంధీని అడ్డుకుని, ఆమె నిరసన చేపట్టిన చోటు నుంచి ఆమెను ఓ ప్రభుత్వ వాహనంలో తీసుకెళ్లడంపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రియాంకా గాంధీని అడ్డుకుని, అక్రమంగా అరెస్ట్ చేయడం బాధాకరం అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంకా గాంధీని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని చూస్తోంటే, యూపీలో బీజేపి సర్కార్ అభద్రతా భావం ఏ స్థాయిలో పెరిగిపోతోందో తెలిసిపోతుందని ఎద్దేవా చేశారు.