మోదీని హత్తుకుని శివసేన కంట్లో పడిన రాహుల్ గాంధీ
సామ్నాలో రాహుల్ గాంధీ గురించి కథనం
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విసుగుచెంది, కేంద్ర ప్రభుత్వానికి దూరంగా జరిగిన మిత్రపక్షం శివ సేన మరోసారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని అభినందనల్లో ముంచెత్తింది. శుక్రవారం పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగిన సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడిన తీరు, వ్యవహరించిన వైఖరిని శివసేన ప్రశంసించింది. శివ సేన కరపత్రంగా పేరున్న సామ్నా పత్రికలో రాహుల్ గాంధీ గురించి ఓ ప్రత్యేక కవర్ పేజీ కథనం ప్రచురించిన ఆ పార్టీ.. రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని హత్తుకున్న ఫోటోను కవర్ పేజీపై ప్రింట్ చేసింది. అంతేకాకుండా 'సోదరా.. నువ్వు అందరి మనసు దోచుకున్నావు' అనే అర్థం వచ్చేలా మరాఠిలో 'భవ జింకలన్స్' అనే టైటిల్ను ప్రముఖంగా ప్రచురించింది. ప్రధాని నరేంద్ర మోదీని రాహుల్ గాంధీ ఏకిపారేస్తూ చేసిన పలు వ్యాఖ్యలను శివసేన ఈ కథనంలో ప్రస్తావించడం గమనార్హం.
మిత్రపక్షమైన యూపీఏకు దూరంగా జరిగిన తర్వాత శివ సేన ఇలా రాహుల్ గాంధీని ప్రశంసించడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో కర్ణాటక ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ గాంధీ అవలంభించిన తీరును సైతం శివసేన ప్రత్యేకంగా అభినందించింది.