కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో ఆకట్టుకున్న దృశ్యం
ఢిల్లీలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్లీనరి సమావేశాల్లో మీడియా కెమెరాలను ఓ దృశ్యం ప్రత్యేకంగా ఆకట్టుకుంది.
ఢిల్లీలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్లీనరి సమావేశాల్లో మీడియా కెమెరాలను ఓ దృశ్యం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. మూడు రోజులపాటు జరగనున్న ఈ 84వ ప్లీనరి సమావేశాలకు హాజరైన పార్టీ శ్రేణులని ఉద్దేశించి ఆవేశంగా ప్రసంగించిన కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ.. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యూపీఏ హయాంలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలను నేలరాస్తూ ఎన్డీఏ సర్కార్ అరాచకపాలన కొనసాగిస్తోంది అని మోదీ సర్కార్‌పై మండిపడ్డారామె. గడిచిన నాలుగేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీని నాశనం చేసేందుకు మోదీ చేయని ప్రయత్నాలు లేవు. ఇంత క్లిష్టమైన సమయంలో రాహుల్ గాంధీ పార్టీ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఎప్పుడూ లేనంత సవాళ్లతో కూడుకున్న సమయం ఇది అని అన్నారు సోనియా గాంధీ.
''తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా పార్టీ ఇలాగే కష్టకాలంలో వుంది. కాంగ్రెస్ పార్టీ బలహీనపడిపోతున్న తరుణంలో తాను తప్పనిసరై రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది'' అని ఈ సందర్భంగా తన రాజకీయ ప్రవేశాన్ని గుర్తుచేసుకున్నారామె. మోదీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టిన ఆమె.. కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించి 2019 ఎన్నికలకు శంఖారావం పూరిస్తామని అభిప్రాయపడ్డారు.
తన ప్రసంగం పూర్తి చేసుకుని వేదికపై నుంచి తన సీటు వద్దకు వెళ్తున్న సోనియా గాంధీకి ఎదురెళ్లిన రాహుల్ గాంధీ.. తన తల్లిని గట్టిగా హత్తుకున్నారు. తల్లీ-కొడుకుల అనురాగాన్ని చూసి అక్కడున్న కాంగ్రెస్ పార్టీ నేతలు లేచి నిలబడి చప్పట్లు చరుస్తూ వారిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్లీనరి సమావేశాల్లో ప్రత్యేకంగా కనిపించిన ఈ దృశ్యం మీడియాను మరింత ప్రత్యేకంగా ఆకట్టుకుంది.